తెలంగాణకు మళ్లీ భారీ వర్షసూచన..!

రాష్ట్రానికి మళ్లీ వానకబురు అందించింది వాతావరణశాఖ. తెలంగాణ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఉందని… అలాగే తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీనివల్ల పశ్చిమ దిశగా తెలంగాణలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని వివరించింది.

ఈ నెల 20, 21న భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఈ ఏడాది ఇప్పటికే భారీ వర్షాలు పడ్డాయి. వాగులు, వంకలు నిండాయి. నదులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. మళ్లీ ఇప్పుడు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సాధారణంగా ఈ సమయానికి తెలంగాణలో మామూలు వర్షపాతం 681 మిల్లీమీటర్లు. కానీ.. ఇప్పటికే 34శాతం అధికంగా 911.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక హైదరాబాద్‌ లో అయితే సాధారణం 549.3 మిల్లీమీటర్లు కాగా.. 21శాతం అధికంగా 664.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.