రాష్ట్రీయం బంగాళాఖాతంలో బలపడనున్న అల్పపీడనం, కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
ఉత్తర అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకున్ని ఉన్న ప్రాంతాల్లోని అల్పపీడనం క్రమంగా బలపడి ఈ నెల 18 నాటికి ఆంధ్రప్రదేశ్ – ఉత్తర తమిళనాడు తీరానికి చేరే అవకాశముంది. ఈ అల్పపీడన ప్రభావంతో.. మంగళ, బుధవారాల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ‘ఉత్తర అండమాన్‌లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి.. తూర్పు మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న ఆగేయ బంగాళాఖాతంలో బుధవారం నాటికి బలపడే అవకాశముంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ.. పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం వద్ద తీరానికి చేరుతుంది’ అని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు.
అల్పపీడనం, దీనికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. రాష్ట్రంలో ముసురు పట్టింది. ఈ ప్రభావంతోనే.. అధికశాతం మండలాల్లో ఎతెరపి లేకుండా జల్లులు పడడం.. లేదా కొద్దిసేపు ఎండ, ఆ వెంటనే జల్లులు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య.. అత్యధికంగా చిత్తూరు జిల్లా సోమలలో 6.4 సెం.మీ, తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం అంగరలో 6.3, మండపేటలో 4.9 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.