‘మా’ అధ్యక్ష రేసులోకి హేమ..

‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్) ఎన్నికలు ఈ ఏడాది మరింత ఉత్కంఠగా జరిగే అవకాశం కనిపిస్తోంది. గతంలో స్నేహపూర్వకంగా సాగే ఈ ఎన్నికలు కొన్నేళ్లుగా సాధారణ ఎన్నికలకు తీసిపోని విధంగా మారుతున్నాయి. ఈసారి ‘మా’ అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు నేరుగా బరిలోకి దిగారు. నటి జీవితరాజశేఖర్‌ సైతం ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వార్తలు వెలువడిన 24గంటల్లోనే మరో నటి హేమ పోరుకు సిద్ధమని ప్రకటించారు. ఆమె గతంలో ‘మా’లో ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా వ్యవహరించారు. ఈ అనుభవంతోనే ఆమె తాజాగా మా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”మా’లో గత కొన్నేళ్లుగా ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పదవులు చేపట్టాను. ఆ పదవులకు న్యాయం చేశాను. ఈసారి ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని అనుకున్నాను. కానీ, ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు బాబు.. జీవిత పోటీ చేస్తున్నారని తెలిసింది. పెద్దల వివాదాల్లో మనమెందుకు చిక్కుకోవాలి.. అసలు పోటీ చేయకూడదనే అనుకున్నాను. నా స్నేహితులు, ముఖ్యంగా మహిళా మద్ధతుదారులు నాకు ఫోన్ చేసి ‘నువ్వెందుకు పోటీ చేయకూడదు. నువ్వుంటే బాగుంటుంది. ఎవరైనా కష్టాలు చెప్పుకోవాలన్నా అర్దరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు. నువ్వు కావాలి’ అని అడుగుతున్నారు. నాకు అండగా నిలిచిన వారందరికోసం, నావారి కోసం ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నాను’ అని హేమ తెలిపారు.