కేసీఆర్ సర్కార్ కి షాక్ ఇచ్చిన హైకోర్ట్

హైకోర్టులో దర్శకుడు శంకర్ కు భూమి కేటాయింపుపై  విచారణ జరిగింది. రూ. 2.5 కోట్ల భూమిని రూ. 25 లక్షలకు ఎలా కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో దర్శకుడు శంకర్ కీలక పాత్ర పోషించారని అడ్వకేట్ జనరల్ రాష్ట్ర హైకోర్ట్ దృష్టికి తీసుకు వెళ్ళగా తెలంగాణ కోసం త్యాగం చేసిన వేల మందికి ఇలాగే ఇస్తారా అని ప్రశ్నించింది హైకోర్టు. హైదరాబాదులో ఇప్పటికే అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఉందని హై కోర్టు పేర్కొంది. ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? అని హైకోర్టు ఈ సందర్భంగా ఏజీని ప్రశ్నించింది.

ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం తప్పుడు సంకేతాలు ఇవ్వరాదని హైకోర్ట్ పేర్కొంది. కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని ఈ సందర్భంగా హైకోర్టు సూచనలు చేసింది. కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు ఇచ్చింది తెలంగాణా హైకోర్ట్. దీనితో కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్ట్. ఇదిలా ఉంటే తెలంగాణా వాదనను దర్శకుడు శంకర్ బలంగానే వినిపించారు. రాష్ట్ర ప్రజల గొంతుని ఆయన జై బోలో తెలంగాణా అనే సినిమా ద్వారా వినిపించారు.

అంతే కాకుండా తెలంగాణా ఉద్యమంలో కూడా క్రియా శీలకంగా ఆయన ఉన్నారు. అటు సిఎం కేసీఆర్ తో పాటుగా తెలంగాణా ప్రభుత్వ మంత్రులకు ఆయనకు మంచి సంబంధాలు ఉద్యమం నాటి నుంచే ఉన్నాయి. దీనితో ఆయన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఉదారంగా వ్యవహరించింది అని పలువురు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకునే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి.