ఆయన పిలుపు.. ఆమెకు జీవన మలుపు!

* ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి దారి చూపిన జనసేనాని
* ఎంబీఏ చదివిన సునీతకు జాబ్
* సిద్ధవటం రచ్చబండలో సునీతకు ఉద్యోగం కల్పించాలని కోరిన శ్రీ పవన్ కళ్యాణ్
* స్పందించిన పార్టీ IT విభాగం సభ్యులు శ్రీ పెన్నమరెడ్డి నాగబాబు
* కంపెనీలో ట్రైనీ రిక్రూటీ జాబ్ …. వర్క్ ఫ్రం హోం

ఆమె చదువు విలువ తెలిసిన ఆడపడుచు.. ఎంబీఏ పూర్తి చేసింది. భూమిని నమ్ముకొని పది మంది కడుపు నింపే హలాధారిని వివాహం చేసుకుంది. ఇద్దరు ముద్దుల సంతానం. సొంత పొలం 2 ఎకరాలతో పాటు… మరో 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని భర్త వ్యవసాయం చేస్తుంటే.. పెళ్లి అయిన తర్వాత ఎంబీఏ పూర్తి చేసింది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే ఆ ఇంటిని అప్పుల భారం కుదిపేసింది. దాన్ని తట్టుకోలేక భర్త బలవన్మరణంతో ఒక్కసారిగా ఆమె బతుకు చీకటైపోయింది. ఇద్దరు చిన్నారులతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. అంధకారంలో ఉన్న ఆమె జీవన నౌకకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ఓ చుక్కానిగా ఉపయోగపడింది. ఉన్నత చదువు చదివిన ఆమెకు ఉపాధి బాటలు పరిచింది. జనసేనాని రచ్చబండ వేదిక నుంచి ఇచ్చిన పిలుపుతో స్పందించిన సహృదయులు ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
– ఉమ్మడి కడప జిల్లా, జమ్మలమడుగు నియోజకవర్గం, బొమ్మనందలకు చెందిన ఎనమల రఘునాథరెడ్డికి, మైలవరం మండలం, పైరాల గ్రామానికి చెందిన కామిని సునీతకు ఏడేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు సంతానం. రఘనాథరెడ్డి తనకున్న రెండు ఎకరాలతో పాటు 10 ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, శెనగ పంటలను వేశారు. వరుస నష్టాలు రావడంతో పాటు కౌలు సొమ్ములు భారమై ఏటికేడాది అప్పులు చేస్తూ వెళ్లారు. ఆ భారం రూ.15 లక్షలకు చేరుకుంది. ఒకవైపు పంట పెట్టుబడి లేక, కౌలు డబ్బులు చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతుంటే, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి ఎక్కువై రఘనాథరెడ్డి గత ఏడాది పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సునీతతో పాటు, ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. దీంతో సునీత పుట్టింటికి చేరుకుంది. తండ్రి చంద్రనారాయణ రెడ్డి, తల్లి రామ లక్ష్మమ్మ కూడా కూలీలే కావడంతో వారినే నమ్ముకొని జీవిస్తోంది. ఈ సమయంలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా కడప జిల్లా సిద్ధవటంలో పెట్టిన రచ్చబండ సభకు సునీత తన పిల్లలతో సహా వచ్చింది. రఘనాథరెడ్డి మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వంతుగా రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. తడారిన కళ్లతో సునీత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తాను ఎంబీఏ చదువుకున్నానని, తనకు ఉద్యోగం ఇప్పిస్తే తన కుటుంబానికి ఆసరా అవుతుందని కోరింది. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్న జనసేనాని వేదికపై నుంచే సునీతకు సహాయ పడాలని కోరారు. ఆమెకు ఉద్యోగం ఇప్పించాలని అభిమానులకు, శ్రేయోభిలాషులకు పిలుపునివ్వడంతో ఆమె చిరు ఆశ సాకారం అయింది.
– పి.గన్నవరంకు చెందిన పార్టీ IT విభాగం సభ్యులు శ్రీ పెన్నమరెడ్డి నాగబాబు శ్రీ పెన్నమరెడ్డి నాగబాబు స్పందించి కామిని సునీతకు ట్రైనీ రిక్రూటీగా ఉద్యోగం ఇచ్చారు. హైదరాబాద్ కు చెందిన రిక్రూటీ మేనేజ్మెంట్ సర్వీస్ ప్రైవేటు లిమిటెడ్ లో జాబ్ అందించారు. కామిని సునీత పిల్లలతో సొంత ఊరి నుంచి హైదరాబాద్ కు వెళ్లి ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడంతో ఆమెకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కంపెనీ కల్పించింది. ట్రైనీ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తరహాలోనే ఆమెకు వేతనం, ఇతర అలవెన్సులు ఉంటాయని కంపెనీ సీఈవో పెన్నమరెడ్డి స్వర్ణ ప్రియ తెలిపారు. దీంతో సునీతకు ఓ దారి దొరకింది. యూకేజీ, నర్సరీ చదువుతున్న తన ఇద్దరు చిన్నారుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ఊతం దొరికింది. తమకేం కాని వ్యక్తి ఎక్కడి నుంచో దేవుడిలా వచ్చి తమ బతుకుల్లో కొత్త ఉషోదయాలు నింపారని, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా కామిని సునీత ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగం ఇచ్చిన కంపెనీ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *