అర్హులైన పేదలకు కేవలం ఒక్కరూపాయికే ఇల్లు: ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం అర్హులైన పేదలకు కేవలం ఒక్కరూపాయికే ఇల్లు ఇవ్వనుంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన 1,43,600 టిడ్కో ఇళ్లను ఒక్క రూపాయి తీసుకుని లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 3 కేటగిరీలుగా నిర్మించిన ఇళ్లను సబ్సిడీతో పేదలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల ఇళ్లకు లబ్ధిదారుల వాటాలో 50 శాతం రాయితీ ఇవ్వనుంది. 365 చ.అ. ఇళ్లకు రూ.50 వేల చొప్పున, 430 చ.అ. ఇళ్లకు లక్ష చొప్పున ఆయా లబ్ధిదారులు చెల్లించవలసి ఉండగా.. అందులో సగం వరకు రాయితీ ప్రకటించారు. ఇప్పటికే పూర్తి వాటా కింద లక్షరూపాయలు చెల్లించిన వారికి రూ.50వేలను ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. ఇప్పటివరకు టిడ్కో కాలనీలుగా పేరున్న ఈ ఇళ్లకు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-వైఎస్ఆర్ జగనన్న నగర్లుగా పేరు మార్పు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

టిడ్కో ఇళ్ల పథకంలో లబ్ధిదారులు కాని వారికి.. వైయస్సార్‌ జగనన్న హౌసింగ్‌ ప్రాజెక్టులో భాగంగా పట్టణాలు, నగరాల్లోని మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వనుంది. ఈ పథకంలో ప్రైవేట్ వెంచర్లను భాగం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కోసం ప్రైవేట్ లే అవుట్లలో 5 శాతం స్థలాన్ని కేటాయించేలా చట్ట సవరణకు కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ప్రైవేట్ లే అవుట్లలో 5 శాతం భూమి లభ్యత లేకపోతే 3కి.మీ. దూరం లోపల కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.