నిజాయతీ… మానవత్వం లేని ప్రభుత్వం ఇది

* ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 281 మంది కౌలు రైతుల ఆత్మహత్యలు
* శ్రీ జగన్ సీఎం అయ్యాక 3 వేల మంది బలవన్మరణాలు
*పది రోజులైనా మాండౌస్ తుపాను బాధిత రైతుల వంక కన్నెత్తి చూడలేదు
* సత్తెనపల్లి కౌలు రైతు భరోసా యాత్ర సభలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

అన్నం పెట్టే అన్నదాతకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఈ మూడున్నరేళ్లలో దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాల దీనస్థితిని చూసైనా ప్రభుత్వ పెద్దల మనసు కరగడం లేదని, వారిలో మానవత్వం లేదని అన్నారు. ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం దూళిపాళ్ల గ్రామంలో జరిగిన కౌలు రైతు భరోసా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న 210 కౌలు రైతు కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతులు మీద రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఉమ్మడి అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్రను విజయవంతంగా నిర్వహించాం. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు భరోసా నింపాం. కౌలు రైతుల ఆత్మహత్యల గురించి తెలిసిన వెంటనే సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు… తన సొంత నిధులు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క గుంటూరు జిల్లాలోనే 280 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కాదు కదా… స్థానిక ప్రజా ప్రతినిధులు ఎవరూ బాధిత కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారం రూ. 7 లక్షల కూడా వైసీపీ సానుభూతిపరులకే ఇచ్చారు తప్ప మిగిలిన రైతు కుటుంబాలను గాలికొదిలేశారు.
* ఫోటోలు కోసం కాదు … భరోసా నింపడానికే వచ్చాం సజ్జల గారూ
ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫొటోల కోసమే కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. అయ్యా సజ్జల గారు… పవన్ కళ్యాణ్ గారు ఫొటోలే దిగాలనుకుంటే చాలా మంది క్యూలో ఉంటారు. అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలబడాలని, వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంతో ఆయన సొంత నిధులను వెచ్చించి కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. జనసేన పార్టీ ఆర్థిక సాయం చేస్తున్న చాలా మంది అసలు కౌలు రౌతులే కాదని కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్లందరికీ ఛాలెంజ్ చేస్తున్నాం. మీకు దమ్ముంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 281 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. వాళ్లందరికీ పార్టీ తరఫున సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే జనసేన సభకు రాకుండా కొంతమంది వైసీపీ నాయకులు వాళ్లను బెదిరించారు. సభకు వెళ్తే ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం నిలిపివేస్తామని భయపెట్టారు. అయినా వాళ్ల బెదిరింపులకు భయపడకుండా దాదాపు 210 కుటుంబాలు ఈ సభకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన చాలా మంది బాధితులు స్థానిక నాయకులు, తహసీల్దార్, కలెక్టర్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన వాళ్లే. నిజాయతీగా పాలించడం, రైతులకు అండగా నిలబడటం ఈ ప్రభుత్వానికి చేతకాదు. మాండౌస్ తుపాను వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఉంటే, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పదిరోజులైనా ఇప్పటి వరకు రైతులకు తక్షణ సాయం అందించలేదు” అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బొలిశెట్టి సత్య, పెదపూడి విజయ్ కుమార్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వర రావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, పోతిన మహేష్, సయ్యద్ జిలానీ, నయుబ్ కమాల్, బేతపూడి విజయ్ శేఖర్, అమ్మిశెట్టి వాసు, నేరెళ్ళ సురేష్, బండారు రవికాంత్, శ్రీమతి బోని పార్వతి నాయుడు, బండ్రేడ్డి రామకృష్ణ, మనుక్రాంత్ రెడ్డి,డా. గౌతమ్, వీరవల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు.
* పార్టీలో చేరిన బొర్రా అప్పారావు
సత్తెనపల్లికి చెందిన నాయకుడు బొర్రా వెంకట అప్పారావు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.