భాషా వాలంటీర్ల ప‌ట్ల ఇంత దుర్మార్గంగా ప్ర‌వ‌ర్తిస్తారా?

*లాఠీచార్జ్ చేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు

సుమారుగా మూడు నాలుగు నెల‌లుగా శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న భాషా వాలంటీర్ల ప‌ట్ల ఇంత క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తిస్తారా? అని జ‌న‌సేన అర‌కు పార్ల‌మెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు ,అల్లంగి రామకృష్ణ, బిమిడి మత్యరాజు మండిప‌డ్డారు. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న భాషా వాలంటీర్లపై లాఠీచార్జ్ చేయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించారు. నిర‌స‌న కారులతో చ‌ర్చ‌లు జ‌రిపి ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల్సింది పోయి ఇలా క‌ర్క‌శంగా, దుర్మార్గంగా లాఠీ చార్జ్ చేయ‌డాన్ని జ‌న‌సేన తీవ్రంగా భావిస్తోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌క్క రాష్ట్రాల వారు వారి భాష‌ల‌ను ర‌క్షించుకునేందుకు తీవ్ర స్థాయిలో ఉద్య‌మాలు చేస్తుంటే ఇక్క‌డ పాల‌కులకు మాతృభాషను గౌర‌వించాల‌న్న క‌నీస ఇంగిత జ్ఞానం కూడా లేక‌పోవ‌డం శోచ‌నీయ‌మ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌న మాతృభాష బోధ‌కులు లేకుంటే త‌ల్లి భాష ఎలా అభివృద్ధి చెందుతుంద‌న్న స్పృహ కూడా లేదంటే ఈ పాల‌కులను ఏమ‌నుకోవాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎంత‌సేపు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల‌కు వారి స్వార్థ ప్ర‌యోజ‌నాలే త‌ప్ప ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌వ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఎమ్మెల్యే ఇంటికి, ఎంపీ క్యాంప్ ఆఫీస్‌కి కూత‌వేటు దూరంలోనే భాషా వ‌లంటీర్లు నిర‌స‌నలు తెలుపుతున్నా మీకు మ‌న‌సు క‌ర‌గ‌లేదా? వాలంటీర్లు కొత్త‌గా జాబ్‌లు అడ‌గ‌డం లేద‌ని, పాత వాటినే రెన్యూవ‌ల్ చేయ‌మ‌ని అడుతున్నార‌ని వారు కోరింది గొంత‌మ్మ కోరిక‌లు కావ‌న్న‌విష‌యాన్ని ఈ పాల‌కు గుర్తుంచుకోవాల‌ని ఆయ‌న అన్నారు. భాషా వ‌లంటీర్ల‌ను రెన్యూవ‌ల్ చేయ‌క‌పోతే వీళ్లు ఉపాధి కోల్పోయే అవ‌కాశం ఉందని, మ‌న్యంలో మాతృభాష‌లు ప్ర‌మాదంలో కూడా ప‌డిపోతాయ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి గారు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏటా జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నిరుద్యోగ స‌మ‌స్య‌ను లేకుండా చేస్తామ‌ని ఎక్క‌బ‌డితే అక్క‌డ చెప్పిన వ్య‌క్తి ప్రస్తుతం దాని ఊసే ఎత్త‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. జాబ్ క్యాలెండ‌ర్ ఏటా విడుద‌ల చేస్తే ఇలా నిరుద్యోగులు రోడ్లపైకి వ‌చ్చే అవ‌కాశం ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం డీఎస్సీ తీస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌రెడ్డి దాని గురించే ఈరోజు మాట్లాడ‌క‌పోవ‌డం వ‌ల్ల నిరుద్యోగ యువ‌త ఈరోజు ఇలా త‌మ నిర‌స‌న‌ను తెలుపుతుంటే లాఠీ చార్జ్‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌మంజస‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. భాషా వాలంటీర్లను వెంట‌నే చ‌ర్చ‌లకు పిలిచి వారి ఉద్యోగాల రెన్యువల్ కు ప్ర‌భుత్వం స‌హ‌క‌రించాల‌ని జనసేనపార్టీ నాయకులు శ్రీరాములు, రామకృష్ణ మత్యరాజు డిమాండ్ చేశారు.