ఇంకెన్నాళ్లు కార్మికుల శ్రమను దోపిడీ చేస్తారు?

ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా పారిశుద్ధ్య కార్మికుల, ఒప్పంద కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయని, శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా కార్మికుల శ్రమను ఇంకెన్నాళ్లు ఈ పాలకులు దోచుకుంటారని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని రెండు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు, ఒప్పంద ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగనే మాయ.. ఆయన పరిపాలన ఇంకా మాయ అన్నట్లుగా పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. 2019 వైసీపీ మ్యానిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటుంటే 2024లో కూడా మా ప్రభుత్వమే వస్తుంది అప్పుడు నెరవేరుస్తాం అంటూ మంత్రులు చెప్పటం దుర్మార్గమన్నారు. ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్నాం అంటే ఇంకొన్నాళ్లు ఆగండి పంచబక్ష్య పరమాన్నం పెడతాం అన్నట్లు వైసీపీ నేతల తీరు ఉందని విమర్శించారు. కార్మికులు గొంతెమ్మ కోర్కెలేమి కోరడం లేదని తమ కష్టానికి తగ్గ ఫలితాన్నే అడుగుతున్నారన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని , సమస్య పరిష్కారం అయ్యేవరకు కార్మికుల పోరాటానికి జనసేన అండగా ఉంటుందని ఆళ్ళ హరి అన్నారు.

రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు సోమి శంకరరావు మాట్లాడుతూ.. కార్మికులకు ఇచ్జిన మాటను నిలబెట్టుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నెలకు 18 వేల జీతం ఇష్టం అన్నమాటలు కూడా నీటి మూటలయ్యాయని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మంత్రుల తీరు ఆక్షేపనీయంగా ఉందన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు సమ్మెను విరమించేది లేదని శంకరరావు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జే ఏ సీ నాయకులు ఉమా మహేశ్వరరావు, సీఐటీయు జిల్లా నాయకులు ముత్యాలరావు రెల్లి రాష్ట్ర సంఘ నాయకులు సోమి ఉదయ్, అజయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.