ఎంతమంది ప్రాణాలు కోల్పోతే నిర్లక్ష్యం వీడతారు..?

  • పాము కాటుతో బాలిక ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై జనసేన ఆగ్రహం
  • నగరపాలక సంస్థ పాలకులు, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డ జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: నగరంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి పాములకు, క్రిమికీటకాలకు నెలవుగా మారాయని ఎన్నిసార్లు నగరపాలక సంస్థ అధికారులకు, పాలకులకు, కార్పొరేటర్లకు చెప్పినా నిమ్మకునేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఇంకెంతమంది ప్రాణాలు పోతే నిర్లక్ష్యం వీడతారని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మండిపడ్డారు. స్థానిక పట్టాభిపురంలో నిరీక్షణ అనే 13 ఏళ్ల బాలిక పాముకాటుతో మృతి చెందటంపై మంగళవారం ఆయన నగరపాలక సంస్థ అధికారులపై, పాలకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని ఇళ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి పాములకు విషపూరిత క్రిమికీటకాలకు నెలవుగా మారాయని జనసేన పార్టీ ఎన్నిసార్లు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకువచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయం అన్నారు. 22వ డివిజన్ పరిధిలోని జానీ కాలనిలోని ఖాళీ స్థలాల్లో పాములు పుట్టలు పగిలినట్లుగా తిరుగుతున్నాయని, ఇళ్లల్లోకి వస్తున్నాయని ఎన్నిసార్లు అధికారుల, పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రెండు రోజుల క్రితం పడ్డ వర్షాలకు పాములు రోడ్లపైనే తిరుగుతున్నాయని సైడు కాలువల్లో సైతం పాములు తిరుగుతున్నాయని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇళ్లల్లో చిన్నపిల్లలు ఉన్నారని ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న భయంతో క్షణక్షణం భయంతో జీవించాల్సి వస్తుందని ప్రజలు చెబుతున్నా చెవిటోడి ముందు శంఖం ఊదిన చందంగా పాలకుల ప్రవర్తన ఉందన్నారు. వర్షాకాలం కావటంతో ఖాలీ స్థలాల్లో పారిశుద్ధ్యం లోపించి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచిఉన్నా అలసత్వం మాత్రం వీడకపోవటం నగరపాలక సంస్థ అధికారులకు, పాలకులకే చెల్లిందని ఆళ్ళ హరి దుయ్యబట్టారు. పన్ను వసూళ్లపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించటంలో మాత్రం లేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు నిర్లక్ష్యాన్ని వీడి సమన్వయంతో నగరంలోని ఖాళీ స్థలాల్లో పెరిగిన చెట్లను తొలిగించాలని, వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని ఆళ్ళ హరి హెచ్చరించారు.