కార్మికుల శ్రమని ఇంకెన్నాళ్లు దోచుకుంటారు?

  • జిల్లా, నగర జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నేరేళ్ళ సురేష్

గుంటూరు: దశాబ్దాలుగా కార్మికుల, కర్షకుల శ్రమను దోచుకుంటూ వారిని ఓటు బ్యాంకుగానే చూస్తున్న రాజకీయ నేతల ఆటలు ఇక సాగవని, రక్తాన్ని చెమటగా మార్చి నిత్యం శ్రమించే కర్షకుల శ్రమను ఇంకెన్నాళ్లు దోచుకుంటారంటూ జనసేన పార్టీ జిల్లా, నగర అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, నేరేళ్ళ సురేష్ మండిపడ్డారు. సోమవారం మేడే సందర్భంగా రాష్ట్ర రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ఎదుట కార్మికులతో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేతలు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పారిశుద్ధ్య కార్మికుల పట్ల, ఒప్పంద కార్మికుల జీవన విధానం పట్ల మొసలి కన్నీరు కార్చి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. మాట్లాడితే మాట తప్పం, మడమ తిప్పం అని అంటుంటారని మరి అసెంబ్లీ సాక్షిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను అంటూ జగన్ రెడ్డి చెప్పిన మాటను నాలుగేళ్లుగా ఎందుకు మడతపెట్టారని దుయ్యబట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతికి వచ్చే పన్నెండు వేల రూపాయల జీతాన్ని వంకగా చూపించి వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలను సైతం ఆపివేయటం దుర్మార్గమన్నారు. రాజకీయ నాయకులతో పాటూ కొందరు కార్మిక సంఘ నేతలు సైతం కార్మికుల్లోని అమాయకత్వాన్ని, అవగాహనా లేమిని ఆసరాగా చేసుకొని మోసం చేస్తున్నారని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ధ్వజమెత్తారు. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ కార్మికులకు అన్యాయం జరిగితే జనసేన చూస్తూ ఊరుకోదని, కార్మికుల న్యాయమైన కోర్కెల సాధనకై జనసేన ఎప్పుడూ కార్మికులకు అండగా పోరాడుతుందని ఆళ్ళ హరి అన్నారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించడం శోచనీయమని రాష్ట్ర కార్మిక సంఘ నేత సోమి శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం హిమని సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి, జెండాను ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో అడపా మాణిక్యాలరావు, నరదాసు ప్రసాద్, చింతా రాజు, ఆనంద్ సాగర్, బండారు రవీంద్ర, పాములూరి కోటి, నాగేంద్ర సింగ్, బందెల నవీన్, సుంకే శ్రీను, బాషా, పులిగడ్డ గోపి, జిల్లా, నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.