‘ఏజెంట్’ కోసం మమ్ముట్టికి భారీ పారితోషికం!

అఖిల్ .. సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ‘ఏజెంట్’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ రోల్ ఉందనీ .. ఆ పాత్ర కోసం ముమ్ముట్టిని తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ బలంగా వినిపించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా చేయడానికి మమ్ముట్టి అంగీకరించారని అంటున్నారు. అందుకు ఆయన తీసుకునే పారితోషికం 3 కోట్లు అంటున్నారు.

మలయాళంలో మమ్ముట్టి మెగాస్టార్ .. ఆయన సినిమా అంటే అక్కడ ఒక రేంజ్ లో హడావిడి ఉంటుంది. అయితే ఇటీవల  కాలంలో ఆయన చేసిన సినిమాలు కొన్ని పరాజయం పాలైనా, అంతమాత్రానికే తగ్గిపోయే క్రేజ్ ఏమీ కాదు ఆయనది. అందువలన ఆయనకి గల క్రేజ్ కారణంగా .. ఆ పాత్రకి గల వెయిట్ కారణంగా అంతమొత్తం ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ద్వారా సాక్షి వైద్య కథానాయికగా పరిచయమవుతోంది. ఇక అఖిల్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సిద్ధమవుతోంది.