మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన హైదరాబాద్ మెట్రో

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని సువర్ణ ఆఫర్ కింద ఛార్జీల్లో 40 శాతం రాయితీ కల్పించగా.. తాజాగా మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు.

రేపటి నుంచి మెట్రో స్మార్ట్ రీచార్జీలపై 50 శాతం వరకు క్యాష్ బ్యాక్ ప్రకటించింది. స్టేషన్లలో, ఆన్‌లైన్‌లో రీచార్జీ చేసుకునే వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. 90 రోజుల్లో ఈ రీచార్జీ మొత్తాన్ని ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు 1500 స్మార్ట్ కార్డులో రీచార్జీ చేస్తే 600 క్యాష్ బ్యాక్‌తో కలిపి 2100 బ్యాలన్స్ స్మార్ట్ కార్డులో జమ కానుంది.

నగర వాసులు ఎక్కువగా మెట్రో రైల్లోనే ప్రయాణించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడించారు. సువర్ణ ఆఫర్ ప్రకటించిన అనంతరం ప్రయాణికుల సంఖ్య 30 శాతం పెరిగిందని తెలిపారు. మెట్రో చార్జీల్లో 40 శాతం రాయితీ ఇస్తూ గతంలో ఆఫర్ ప్రకటించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల ఇప్పుడు రోజుకు సరాసరి లక్షా 30 వేల మంది వరకు మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నట్లు వివరించారు.