పెళ్లి తర్వాత కూడా నటిస్తా.. మీ ఆశీర్వాదం కావాలి..

కాజల్ అగర్వాల్ పెళ్లి వార్త ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. వయసు 30 దాటినా కూడా ఇప్పటికీ వరస సినిమాలతో స్టార్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. తన పెళ్లికి సంబంధించి మంగళవారం తీపి కబురు వినిపించారు. వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో ఈ నెల 30న ముంబైలో తన వివాహ వేడుక జరగబోతున్నట్లు కాజల్‌ అధికారికంగా వెల్లడించారు. ”గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకోబోతున్న విషయం అభిమానులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముంబైలో ఆత్మీయుల సమక్షంలో మా వివాహ వేడుక జరగబోతోంది. కరోనా మహమ్మారి మా ఆనందాన్ని కాస్త తగ్గించిన మాట నిజమే! కానీ గౌతమ్‌తో కొత్త జీవితం ప్రారంభించడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఇన్నేళ్లుగా నాపై కురిపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఈ కొత్త ప్రయాణంలో మేమిద్దరం మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం. పెళ్లి తర్వాత కూడా నాకు ఎంతో ఇష్టమైన నటనను కొనసాగిస్తాను. ప్రేక్షకులకు వినోదం అందిస్తాను” అని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్ట్‌లో కాజల్‌ పేర్కొన్నారు. ఇటీవల కాజల్‌ బ్యాచిలర్‌ పార్టీ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలతోపాటు కాజల్‌, గౌతమ్‌ వివిధ సందర్భాల్లో కలిసి తీసుకున్నవి నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి.

అయితే కాజల్ పెళ్లి ఫిక్స్ అయిందని వార్తలు రావడంతో.. ఆమె కాబోయే భర్త గౌతమ్ కిచ్లూ గురించి నెట్టింట్లో వెతకడం షూరూ చేశారు అభిమానులు. అయితే ఇంటి అలంకరణ, టెక్ డిజైన్ సేవలందిస్తున్న ‘డిసర్న్ లివింగ్’ అనే కంపెనీ వ్యవస్థాపకుడు గౌతమ్‌. ఈ సంస్థకు ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానూ విధులు నిర్వహిస్తున్నారు. ఇక గౌతమ్ క్యాథడ్రల్ అండ్ జాన్ కోనన్ స్కూల్ తో పాటు టఫ్ట్స్ యూనివర్శిటీలో విద్యను అభ్యసించారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రత్యేక కోర్సులను నేర్చుకున్న తరువాత, సొంత కంపెనీని పెట్టి రాణిస్తున్నారు.