తెలంగాణ దేశానికే ఆదర్శం: గవర్నర్ తమిళిసై

72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్స్‌లో మంగళవారం ఉదయం ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శమని అన్నారు. మిగతా రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. కరోనాను రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా ఎదుర్కుందని, కరోనా సమయంలో సొంత ఖర్చులతో వలస కూలీలను వారి ప్రాంతాలకు తరలించామన్నారు.

పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని గవర్నర్‌ తమిళిసై చెప్పారు. పల్లె ప్రగతి పథకం దేశానికి ఆదర్శమని, రాష్ట్రంలో 12 వేలకు పైగా డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేశామన్నారు. హరితహారంలో నాటిన మొక్కల్లో 91 శాతం రక్షించామని, ప్రతి గ్రామంలో వైకుంఠధామం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో ఎనలేని కృషి చేసిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు గవర్నర్‌ తమిళసై హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, సీఎస్‌, డీజీపీ, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.