ఆ సినిమా చేసి ఉంటే హాలీ వుడ్ కేగిన తొలి తెలుగు హీరో అయ్యుండేవారేమో..!: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్

అతని కళ్ళు కరుణ కురిపించే లేడి కళ్ళు కాగలవు, రౌద్రం గర్జించే పులి కళ్ళు కాగలవు.

అతను స్వయం కృషితో ఎదిగి ప్రేక్షకుల మనసులో బంధీ అయిన ఖైదీ, మరెందరికో స్ఫూర్తి.

సినీ వినీలాకాశంలో అత్యుత్తమ నక్షత్రం, ఆకాశాన్ని అందుకునేంతగా ఎదిగిన ఆలయ శిఖరం  మెగాస్టార్ చిరంజీవి.

అలాంటి చిరంజీవి మన రాష్ట్రాన్ని, దేశాన్ని దాటి విశ్వమంతా విస్తరించాలని హాలీవుడ్ కి వెళితే…? ఆ ఊహకే అభిమానులకే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 90వ దశకంలో అలాంటి ఒక అద్భుత ప్రయత్నమే జరిగింది. రెండు దశాబ్దాల క్రితం అన్నీ సక్రమంగా జరిగి ఉంటే  తొలి అంతర్జాతీయ భారతీయ నటుడుగా మెగాస్టార్ చిరంజీవి పేరు సినిమా చరిత్రలో నిలిచిపోయేది. ఆ సినిమా పేరు అబు బాగ్దాద్ గజదొంగ. 1999 వ సంవత్సరంలోనే అప్పటికి అత్యథిక 50 కోట్ల బడ్జెట్ తో షూటింగ్ మొదలు పెట్టిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

కొన్ని తరాలుగా ప్రజల జ్ఞాపకాలలో మెదులుతూ ఉండిపోయిన ఓ గాథే ‘బాగ్దాద్ గజదొంగ’. ఈ కథ తొలిసారిగా ఒక మూకీ సినిమాగా 1916 లో రూపు దిద్దుకుంది.  తర్వాత 1940 లో ‘ థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ గా శబ్ద చిత్రం తయారు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులందరినీ అలరించి విజయాన్ని వరించింది. ఆ తర్వాత 90వ దశకంలో ఇదే కథని ఇండస్ ఇండ్ కార్ప్ సమర్పణలో, ముగ్గురు భారతీయ నిర్మాతలు ‘ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ గా నిర్మించ తలపెట్టారు. అప్పటికి అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడానికి దర్శక నిర్మాతలు సిద్దపడినప్పటికీ, ముస్లిం సోదరుల పవిత్ర గ్రంథమైన ఖురాన్ కి సంబంధించిన సన్నివేశం వలన షూటింగ్ నిలిపివేశారు. ఇంటర్నెట్ లో సమాచారం ప్రకారం ఒక సన్నివేశంలో ఖురాన్ ను చాలా పురాతన గ్రంధంగా చూపించడానికి టీ లో ముంచినట్లు సమాచారం తెలిసి అభ్యంతరం పెట్టడం వలన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కొందరు బురదలో ముంచారు అంటారు, కొందరు వైన్ లో ముంచారు అంటారు.

ఈ చిత్రాన్ని ‘థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ కంటే గొప్పగా చిత్రీకరించాలి అని దర్శకుడు ‘డచన్ జెర్సీ’ భావించారు. ‘ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ ఇంగ్లీష్ భాగానికి డచన్ దర్శకులు అయితే, తెలుగు భాగానికి  సురేష్ కృష్ణ దర్శకులు. సురేష్ కృష్ణ అంటే భాషా సినిమా దర్శకులు. ‘ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ ఇంగ్లీష్, తెలుగు రెండు భాషల్లో ఒకేసారి రూపొందించాలి అనుకున్నారు. సుమారు 45 నిముషాలు పాటు గ్రాఫిక్స్ ప్రధాన ఆకర్షణ గా నిలిచే ఈ చిత్రం యొక్క ఇంగ్లీష్ భాగం 90 నుండి 100 నిముషాలు, తెలుగు భాగం రెండున్నర గంటల పాటు ఉండాలని నిర్ణయిచారు. తెలుగు భాషలో అదనంగా హాస్య సన్నివేశాలతో పాటు  5 పాటలు కూడా ఉంటాయి. ఇంగ్లీష్ వెర్షన్ లో పాటలు ఉండవు.  తెలుగు భాగాన్ని తమిళ్ మరియు హిందీ లోకి డబ్బింగ్ చేసి విడుదల చెయ్యాలి అనీ, ఇంగ్లీష్ భాగాన్ని కేన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించాలనీ భావించారు.

ఈ చిత్రానికి రచన: జాస్మిన్ సబు, సంగీతం: ఏ. ఆర్. రెహమాన్, ఫోటోగ్రఫీ: రిచర్డ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అర్జున్ దళవాయి, నిర్మాతలు: రమేష్ కృష్ణ మూర్తి, సుందర స్వామి, గణేష్ మహదేవన్, దర్శకులు: డచన్ జెర్సీ, సురేష్ కృష్ణ ఎన్నో అద్భుతాలతో బయటకి వచ్చి ప్రేక్షకులను అలరించాల్సిన సినిమా, మధ్యలో ఆగిపోయిన భారీ బడ్జెట్ సినిమాల లిస్ట్ లో చేరిపోయింది.  

– సేకరణ: వంశీ కమల్