మళ్ళీ జగన్ రెడ్డి వస్తే ఒక కిడ్నీ, ఒక కన్ను తొలగింపు పధకం అమలు: ఆళ్ళ హరి

గుంటూరు, జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడేమో అన్న ఊహే ప్రజల్ని భయపెడుతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే సింగిల్ కిడ్నీ, ఒక కన్ను తొలగింపు పథకాన్ని తొలిరోజే ప్రారంభిస్తాడని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సింగిల్ కిడ్నీ – వన్ ఐ తాకట్టులో ఆంధ్రప్రదేశ్ గోడప్రతులను శ్రీనివాసరావుతోటలోని భరతమాత విగ్రహం వద్ద శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ పాలనలో ప్రభుత్వ ఆస్థులన్ని తాకట్టుకి వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంతో పాటూ భవాని ఐల్యాండ్ వంటి వాటిని కూడా తాకట్టు పెట్టిన మహా ఘనుడు జగన్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు ఒక వైపు ఇసుక, మట్టి, మైనింగ్ వంటి సహజ వనరులను వైసీపీ నేతలు పీకలదాకా మింగేసారని మండిపడ్డారు. మళ్ళీ జగన్ వస్తే ప్రజల అవయవాలపై దృష్టి పెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అమలు అవ్వాలంటే మనుషులు ఒక కిడ్నీ, ఒక కన్ను ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుందని వైసీపీ నేతలు చెబుతారని పేర్కొన్నారు. ఒక కిడ్నీ లేకపోయినా, ఒక కన్ను లేకపోయినా ప్రజల జీవితాలకు ఏమీ కాదని జగన్ రెడ్డి భావిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి దుర్మార్గాలు, దాష్టీకాలు పతాక స్థాయికి చేరాయని ఆందోళన వ్యక్తం చేరారు. వైసీపీ అరాచకాల నుంచి రాష్ట్ర ప్రజల్ని కాపాడేందుకే బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాన్ని వైసీపీ కబంధ హస్తాల్లోంచి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆళ్ళ హరి అన్నారు. ఈ కార్యక్రమంలో రెల్లి యువత నాయకులు సోమి ఉదయ్ కుమార్, జనసేన నాయకులు సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, కొలసాని బాలకృష్ణ, కోలా అంజి, ఎర్రబోతు శ్రీనివాసు, నాజర్ వలి, స్టూడియో బాలాజీ, టీడీపీ నాయకులు కోలా మల్లి తదితరులు పాల్గొన్నారు.