బాధితులకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తా

జయలక్ష్మి బ్యాంకు బాధితుల కోసం స్పందించిన మాజీ మేయర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ హెచ్చరిక .

కాకినాడ, జయలక్ష్మి కో ఆపరేటివ్ బ్యాంకు బాధితులకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహారదీక్షకు కూడా వెనకాడననీ, కాకినాడ కార్పొరేషన్ మాజీ మేయర్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ పేర్కొన్నారు. దాదపు వెయ్యి కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన జయలక్ష్మి బ్యాంకు బాధితులు స్ధానిక సర్పవరం జంక్షన్ మెయిన్ బ్రాంచ్ ఆవరణలో బాధితుల సంఘ అధ్యక్షులు గంజా బధిరినారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నగర కార్పొరేషన్ మాజీ మేయర్ పోలసపల్లి సరోజ విచ్చేసి బాధితులకు దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దాదపు మూడు నెలల క్రితం బ్యాంకు బోర్డు తిప్పేసినా, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది డిపాజిట్ దారులు బాధితులుగా ఉన్నారనీ, ప్రభుత్వం ఇప్పటి వరకు మీన మేషాలు లెక్కించటం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. స్ధానిక ప్రజా ప్రతినిధులైన కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, బాధితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ, పోలీసు వైఖరి అనుమాన స్పదంగా ఉందని, సిబిసిఐడి వార్కి కేసు అప్పగించామనీ స్ధానిక పోలీసులు తెలపటం కాస్త ఆశజనకమైనా, కేసుకు సంబంధించిన నిందితులను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల స్కాం జరిగితే ప్రభుత్వ స్పందన సరిగా లేదని నిందితులను కాపాడుతున్నారా అనే అనుమానాలు కలుగు తున్నాయన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్య తీసుకువెళతానని, మొదటి నుంచి ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ నిలబడతారనీ, ఈ సమస్యను సైతం పవన్ కళ్యాణ్ స్పందించి ప్రభుత్వం న్యాయం చేసేలా కృషి చేస్తారనీ అన్నారు. ఈ సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ కృష్ణారావు, సెక్రటరీ పిల్లిగణేష్, జాయింట్ సెక్రటరీలు చి.పల్లం రాజు, చింతా సుబ్బారావు, కోశాధికారి వీఎస్వీ సుబ్బారావు, సభ్యులు అంగార నరసింహారావు, కస్తూరి రవి కుమార్, కె.గౌరీ శంకర్, పి.వెంకటరమణ మూర్తి, కుప్పిలి రామకృష్ణ, బ్యాంకు బాధితులు తదితరులు పాల్గొన్నారు.