కృష్ణాష్టమి పర్వదినాన కృష్ణుని పూజిస్తే సకల పాపాలూ పోతాయి: స్కంద పురాణం

దేవకీ వసుదేవులకు అష్టమసంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణావతారo శ్రీమహావిష్టువు ఎనిమిదో అవతారం. ద్వాపరి యుగంలో శ్రీముఖనామ సంవత్సరం శ్రావణంమాసంలో బహుళ అష్టమినాడు అర్ధరాత్రి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్య తిథినే ‘కృష్ణాష్టమి’గా జరుపుకుంటారు. కృష్ణాష్టమిని జన్మాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు.

ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుoటూ ప్రతి ఇంటా బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిల్లలో వేస్తారు. షోడశోపచారాలతో కృష్ణుడికి పూజిoచి… కృష్ణునికి ఎంతో ప్రీతి పాత్రమైన నైవేద్యాలు అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ, శనగలు మొదలైనవన్నీ సమర్పిస్తారు.

కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి మరియు ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కన్దపురాణం చెబుతుంది. అంతే కాకుండా ఈ రోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పారు. సంతానం లేని వారు బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది.

అదే విధంగా వివాహం కానివారు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది. అలాగే శ్రీకృష్ణున్ని స్మరిస్తూ గోవులను దానం చేస్తే ఆ భగవానుడి అనుగ్రహం, కృప కలుగుతాయని భక్తులు నమ్ముతారు.

ఇక శ్రీకృష్ణుడు వెన్న కోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే… కృష్ణాష్టమి నాడు భక్తులంతా ఒక చోటికి చేరి బాలకృష్ణుని చిలిపి చేష్టలను తల్చుకుంటూ… పాలు, పెరుగు, వెన్న, అటుకులు, పళ్లులాంటి పదార్థాలు ఉంచిన ఉట్టికొట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఉట్టి కొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు. మరికొందరు హోళీ తరహాలో గులాల్‌ చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. ఇంకొందరు బాలకృష్ణుని ప్రతిమను మనసారా అలంకరించిన  ఊయలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు, భజనలు పాడుతూ ఉంటారు.