ఎంఎస్ ధోనీ ఉంటే చాలు.. కప్ కొడతాం: కోహ్లీ

టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మార్గదర్శకుడిగా ఉండడం తమకు ఎంతో సంతోషంగా ఉందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ధోనీ జట్టుతో ఉంటే చాలని, కప్ కొట్టడానికి ప్రయత్నిస్తామన్నాడు. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించడమే కాక అప్పటికప్పుడు సలహాలు ఇవ్వడం ద్వారా మహీ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడని కోహ్లీ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు మెంటర్‌గా ఇటీవల బీసీసీఐ ఎంఎస్ ధోనీని నియమించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 కోసం యూఏఈ వెళ్లిన మహీ.. ప్రపంచకప్‌ కోసం అక్కడే ఉండనున్నాడు.

శనివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు విషయాలపై స్పందించాడు. ‘తిరిగి భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి రావడానికి ఎంఎస్ ధోనీ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మహీకి అపార అనుభవం ఉంది. మేమంతా కెరీర్లు ఆరంభించిన దశలో ధోనీ మార్గనిర్దేశకుడి పాత్రే పోషించాడు. కెరీర్‌ ఆరంభంలోనే పెద్ద టోర్నీలు ఆడే యువ క్రికెటర్లు మహీ సలహాల వల్ల లాభం పొందనున్నారు. ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అప్పటికప్పుడు సలహాలు ఇస్తాడు. అతను మాతో ఉన్నాడన్న మాటే మాకెంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. టీ20 ప్రపంచకప్‌లో మహి మార్గదర్శకుడిగా ఉండడం మాకెంతో సంతోషంగా ఉంది. కప్ కొడుతామనే ధీమా ఉంది’ అని కోహ్లీ చెప్పాడు.

అక్టోబర్ 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌పై భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి ఈ మ్యాచ్ గురించి మాట్లాడాడు. ‘పాకిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌ని నేను ఎప్పుడూ ఓ సాధారణ మ్యాచ్‌గానే తీసుకున్నాను. ఈ మ్యాచ్ గురించి చాలా హైప్ ఏర్పడిందని తెలుసు. అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి.

ఈ మ్యాచ్ నుంచి మనం అదనంగా ఏదైనా తీసుకోగలమని నేను అనుకోను. మేము వీలైనంత ప్రొఫెషనల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాం. అభిమానుల​ దృష్టిలోనే ఇది పెద్ద మ్యాచ్​. కానీ ఆటగాళ్లు ఇతర జట్లతో ఆడినట్లే ఈ మ్యాచ్​ కూడా ఆడతారు’ అని కోహ్లీ తెలిపాడు.

టీ20 ప్రపంచకప్‌ జట్టులో టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు కొదవలేదని.. వాళ్లు కాస్త పరిపక్వతతో ఆడితే ట్రోఫీ సాధించడం టీమిండియాకు పెద్ద కష్టమేమి కాకపోవచ్చని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ‘ఛాంపియన్లుగా నిలవడమనేది మామూలు విషయం కాదు. ఆరంభ మ్యాచ్‌లో గెలిచినంత మాత్రాన కప్‌ సాధించినట్లు కాదు. సిరీస్ మొత్తం నిలకడగా రాణించాలి. ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిస్తేనే కప్ దక్కుతుంది.

అంతకంటే ముందు చాలా మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. అందుకే టైటిల్ గురించి ఆలోచించకుండా.. ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించడంపైనే భారత్ దృష్టి పెట్టాలి. భారత జట్టులోని ప్రతి ఆటగాడిలో ఎంతో నైపుణ్యం ఉంది. వాళ్లందరూ పరుగులు చేయగలరు, అవసరమైనప్పుడు వికెట్లు కూడా తీయగలరు. అందుకే ఫలితం గురించి ఆలోచించకుండా.. తాము చేసే పనిపైనే దృష్టి పెట్టాలి’ అని దాదా చెప్పుకొచ్చాడు.