ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్‌ జేఏసీ శిబిరంలో కూర్చుంటే ఆ ప్రభావం వేరే లెవెల్: గంటా

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు నిర్మాణాత్మక కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం వైఖరిని ప్రధానమంత్రి స్వయంగా చెప్పినా.. రాష్ట్రంలోని భాజపా పెద్దలు ఏమీ జరగట్లేదంటూ పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తే దానికి తెదేపా మద్దతుగా ఉంటుందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోకపోతే చరిత్రహీనులవుతామని.. ప్రజలు సాధించుకున్న ఈ ప్లాంట్‌ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధాన మంత్రితో మాట్లాడే అవకాశం వచ్చినా స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై కనీసం ప్రస్తావించలేదని విమర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి దిల్లీలో పాదయాత్ర చేపట్టి ప్రధానిని కలిసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని గంటా డిమాండ్‌ చేశారు. దిల్లీలో పాదయాత్రకు తాము సిద్ధమని, అందరూ కలిసి రావాలని కోరారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా గతంలో దిల్లీ పెద్దలను కలిశారని గుర్తు చేశారు. అయితే, ఆయన అంతటితో ఆగకుండా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జేఏసీ శిబిరంలో కూర్చుంటే ఆ ప్రభావం వేరేగా ఉంటుందన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు అంతా రాజీనామా చేయడం ద్వారా దేశమంతా మనవైపే చూస్తుందన్నారు. అందరూ రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందన్నారు. వైకాపా సభ్యులు రాజీనామా చేసిన చోట తెదేపా పోటీ పెట్టదని స్పష్టం చేశారు. ఇందుకోసం నిర్మాణాత్మక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని సీఎంను కోరారు. అందరూ ముందుకొచ్చి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.