పాలించేవాడు ప్రయోజకుడు కాకపోతే ఎన్ని పథకాలున్నా ఏం ప్రయోజనం?

* నవరత్నాల పేరుతో అన్ని వర్గాలకు తీరని అన్యాయం చేసిన వైసీపీ సర్కార్
* ఈసారి మాయమాటలు చెప్పడానికి ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో వస్తాడు
* ఎన్నికల వేళ ప్రజలను మభ్యపెట్టే మాటలు
* అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదని ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా?
* అన్ని వర్గాలకీ సమ ప్రాధాన్యం ఇవ్వడమే జనసేన లక్ష్యం
* గుంటూరులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఆత్మీయ సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

‘గత ఎన్నికల్లో కనిపించిన వారందరికీ ముద్దులుపెట్టి, బుగ్గలు నిమిరి రకరకాల మాయ మాటలతో మోసం చేసి ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ఈసారి హెలికాప్టర్ లో వస్తున్నాడు. మాయ మాటలతో మభ్యపెట్టడానికి చూస్తాడు’ అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ఒక్క అవకాశం ఇచ్చి నిండా మునిగిన ఏపీ ప్రజలు, మళ్లీ అదే తప్పు చేయకుండా ఈసారి బడుగు బలహీన వర్గాలకు, దళిత, మైనారిటీలకు అండగా నిలబడే జనసేన పార్టీకి అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. గుంటూరు నగరంలో సోమవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందు దివంగతులైన ప్రజా గాయకుడు శ్రీ గద్దర్ గారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వివిధ వర్గాల నాయకులు వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ఎన్ని పథకాలు తెచ్చినా పాలించేవాడు సరైనోడు కాకపోతే మొత్తం వ్యవస్థకే చేటు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది. నవరత్నాల పేరుతో పథకాలను ప్రజలకు అందజేస్తున్నామని చెబుతున్న వైసీపీ, వివిధ వర్గాలకు సంబంధించిన ప్రత్యేక పథకాల నిధులను బలవంతంగా దారి మళ్ళించి నవరత్నాలు అమలు చేస్తోంది. అన్ని వర్గాలకు మేలు చేస్తామని చెప్పడం వేరు.. ఆచరించడం వేరు. జనసేన పార్టీ సంస్థాగత పదవుల్లో అన్ని వర్గాలకు తగు ప్రాధాన్యం కల్పించింది. అందరికీ సమాన అధికారాలను ఇచ్చింది. ఏ వర్గాన్ని పూర్తిస్థాయిలో ఆదుకోని పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిత్యం యాతన పడుతున్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క కుటుంబాన్ని అయినా పేదరికం నుంచి ధనికులుగా మార్చామని చెప్పే ధైర్యం ఉందా..? ఏ కుటుంబ జీవన శైలిని అయిన మార్చాము అని ఘనంగా చెప్పుకోవడానికి ఉదాహరణ ఉందా..? చెప్పండి.
* అందరినీ మోసం చేసిన జగన్ రెడ్డి
బీసీ వర్గాల్లోని ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ బీసీల్లోని కులాలకు ప్రత్యేకమైన కార్పొరేషన్లను వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లు పదవులు ఇచ్చి కేవలం కాగితాల్లో వారికి అధికారం ఇచ్చారు తప్ప, ప్రత్యేకంగా నిధులు లేవు విధులు లేవు. కనీసం కార్యాలయాలు కూడా లేకుండా బీసీ కార్పొరేషన్లు తెచ్చామని గొప్పలు చెప్పుకొంటున్నారు. ఆ కార్పొరేషన్ల ద్వారా ఎంత మందికి సహాయం అందింది..? ఆయా కార్పొరేషన్లు చేసిన మేలు ఎంత అనేది వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తెలియజెప్పాలి. నిధులు లేని కార్పొరేషన్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎస్సీలకు సంబంధించిన 24 పథకాలను వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా దారి మళ్లించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి పూర్తిగా తూట్లు పొడిచారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకం పేరును మార్చి జగనన్న విదేశీ విద్యా పథకంగా చేశారు. పోనీ పథకం పేరు మార్పు తర్వాత అయినా అందరికీ మేలు చేశారా అంటే అది లేదు. కేవలం ప్రపంచంలోని టాప్ 50 యూనివర్సిటీల్లో బాగా చదువుకున్న వారికే ఫీజు చెల్లిస్తామంటూ మెలికలు పెట్టి మొత్తం పథకం స్వరూపమే మార్చేశారు. పేదలు ఉన్నత చదువులు చదువుకోవడానికి అర్హత లేకుండా చేశారు. పథకాన్ని నిర్వీర్యం చేసి గొప్పలు చెప్పుకుంటూ పత్రికల్లో రూ.3 కోట్లు ఖర్చు పెట్టి ప్రకటనలు గుప్పించారు. మైనారిటీ సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నీళ్లు వదిలేసింది. మైనారిటీల సంక్షేమాన్ని కూడా నవరత్నాలు పథకాల్లో భాగంగా వారి నిధులను కలిపేసింది. గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాలు, పథకాలు మైనారిటీలకు వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిలిచిపోయాయి. సచార్ కమిటీ నివేదికలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. మైనారిటీల అభివృద్ధి కోసం సచార్ కమిటీ ఇచ్చిన ముఖ్య సూచనలను వైసీపీ ప్రభుత్వంలో ఏమాత్రం అమలు చేయలేకపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ పాలనలో జరిగిన మోసాలు అన్ని ఇన్ని కావు. అన్ని వర్గాల ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. సత్తెనపల్లిలో ఓ నిరుపేద కుటుంబంలో ఓ బిడ్డ ప్రమాదవశాత్తు చనిపోతే సీఎం ఫండ్ నుంచి వచ్చిన డబ్బుల్లో సగం ఇవ్వాలని డిమాండ్ చేసిన చరిత్ర వైసీపీ ప్రజాప్రతినిధులది. పేద ప్రజలను వంచిస్తూ, దగా చేయడం మాత్రమే వైసీపీకి తెలుసు.
* అర్హులకు పథకాలు అందలేదని నాలుగున్నర సంవత్సరాలకు ఒప్పుకున్నారు
రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఎన్నికల ముందు జగనన్న సురక్ష కార్యక్రమం పేరుతో తన తప్పును ఒప్పుకుంది. గత నాలుగున్నర సంవత్సరాలలో 9.63 లక్షల మంది అర్హులైనప్పటికీ సంక్షేమ పథకాలు అందించలేకపోయామని, వారికి జగనన్న సురక్ష పథకంలో మళ్లీ పూర్తిస్థాయిలో పథకాలు అందజేస్తామని ఎన్నికల ముందు నాటకం మొదలుపెట్టింది. ఇప్పటికే పూర్తిగా మోసపోయిన ప్రజలు వైసీపీ ప్రభుత్వం చెప్పే ఈ మాటలను నమ్మరు. స్పందన లేని నాయకులు స్పందన కార్యక్రమాన్ని పెడతారు. బాధ్యత లేని నాయకులు జగనన్నకు చెబుదాం అంటారు. సమస్యలు వినడానికి అక్కడ ఎవరూ లేకుండా ఏం చెబుతాం… వారు ఏమి వింటారు.? రాష్ట్రాన్ని గంజాయి మయం చేసి యువతకు భవిష్యత్తు లేకుండా చేశారు. లిడ్ క్యాప్ లాంటి సంస్థల నుంచి ఎందుకు రుణాలు ఇవ్వడం లేదు..? మిగిలిన కార్పొరేషన్ నుంచి ఒక్క పైసా రుణం ఎందుకు అందడం లేదు? దీనిపై వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అధికారం అనేది కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం కాదు. అది అందరిదీ అని జనసేన పార్టీ బలంగా నమ్ముతుంది. రాజకీయాల్లోకి ప్రతి ఒక్కరూ రావాలని, అది మన బతుకులు మార్చే బలమైన సాధనమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నమ్ముతారు. దానికి అనుగుణంగానే ఆయన పార్టీ పదవుల్లో కూడా అన్ని వర్గాలకు తగు ప్రాధాన్యమిస్తారు. 2019 ఎన్నికల్లో సైతం జనసేన పార్టీ జనరల్ స్థానాల్లో సైతం దళితులకు మైనారిటీలకు అవకాశం ఇచ్చింది. వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించింది. రాజకీయంగాను జనసేన పార్టీలో ఎన్నో ప్రయోగాలు చేశాం. అందరికీ సమాన అవకాశాలు రావాలని అన్ని వర్గాలు రాజ్యాధికారంలో పాలుపంచుకోవాలని జనసేన పార్టీ బలంగా భావిస్తుంది. జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో సైతం కులాలను కలిపే ఆలోచన విధానం ఉంది. అంతా సంఘటితం అయితే ఏదైనా సాధించుకోవచ్చు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ఎక్కడికి వెళ్లినా అన్ని వర్గాలను కలుసుకోవడానికి వారి సమస్యలు వినడానికి, వేదనలను అర్థం చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు పూర్తిస్థాయి రాజ్యాధికారం దక్కితేనే ఆయా వర్గాలు విలసిల్లడానికి అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు భావిస్తారు. దానిని దృష్టిలో ఉంచుకునే జనసేన పార్టీ రాజకీయంగా అడుగులు వేస్తుంది. ఆయా వర్గాలకు ఎప్పుడు అన్యాయం జరిగినా జనసేన పార్టీ గొంతు బలంగా వినిపిస్తుంది. మండల్ కమిషన్ డే అయిన నేడు వెనుకబడిన వర్గాలకు విస్తృత అవకాశాలు ఇవ్వాలని జనసేన పార్టీ బలంగా భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు జనసేన పార్టీకి అండగా నిలబడాలి” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నేతలు కళ్యాణం శివ శ్రీనివాస్, చిల్లపల్లి శ్రీనివాసరావు, నయుబ్ కమల్, సయ్యద్ జిలానీ, బేతపూడి విజయ శేఖర్, బండారు రవికాంత్, నేరెళ్ళ సురేష్, ఇస్మాయిల్ బేగ్, బోని పార్వతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.