ప్రజా సమస్యలపై మాట్లాడితే వైసీపీ గాడిదలు వ్యక్తిగత విషయాలపై ఓండ్ర పెడతాయి

* రైతుల బాధలు పట్టవు.. వారాహి రంగేమిటి? టైర్లు ఏమిటి అంటూ మాట్లాడతారు
* వారాహిలో పర్యటిస్తా.. ఎవరు ఆపుతారో చూస్తా
* అణగారిన వర్గాలకు అధికారం అందేలా చేయడమే జనసేన పార్టీ లక్ష్యం
* వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తి లేదు
* అధికారం రాని కులాలను ఒక్కటి చేస్తాం
* ఆంధ్ర థానోస్ చెప్పినట్లు వైసీపీ అవినీతికి జనసేన ఆలంబనకు వర్గ పోరాటం
* బీసీలకు భోజనం పెట్టడమేనా వైసీపీ సాధికారత?
* యువతకు ఉద్యోగాల్లో వయో సడలింపు ఇవ్వాలి
* ప్రభుత్వ ఖజానాలో ప్రతి పైసాకు జనసేన ప్రభుత్వంలో లెక్క చెబుతాం
* ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నా వ్యూహం ఉంటుంది
* సత్తెనపల్లి కౌలు రైతు భరోసా యాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్

‘రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు.. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారు.. ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి. వారాహి రంగేమిటి, టైర్లు ఎలా ఉన్నాయి, ఎత్తు ఎంత అంటూ మాట్లాడతారు’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు అధికారం దక్కాలి.. అలా దక్కాలి అంటే సాధికారిత రావాలి అన్నారు. దామాషా పద్ధతి రాజకీయాల్లో లేకున్నా మేమెంతో మాకంతే అన్న పద్ధతి రావాలని అభిప్రాయపడ్డారు. అణగారిన వర్గాలు కేవలం ఓటు బ్యాంకు కింద మిగిలిపోకూడదు.. కచ్చితంగా వారికి అధికారం దక్కాలి అన్నదే జనసేన నినాదం అని తెలిపారు. కొన్ని కులాలలో ఉన్న నాయకులకు పదవులు దక్కడం విధానం కాదు.. పూర్తి స్థాయి అధికారం కులానికి దక్కితేనే వారి అభివృద్ధి, అభ్యున్నతి సాధ్యమవుతుందన్నారు. మీరు ఎంతున్నా అధికారం మొత్తం మాదే అన్నది వైసీపీ విధానం ఐతే… మేమెంతో మాకు అంతే అనే మాట మా జనసేన పార్టీది అని తెలిపారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆదివారం జరిగింది. సత్తెనపల్లి సమీపంలోని ధూళిపాళ్ల గ్రామంలో జరిగిన సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత మూడు సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకున్న 281 మంది కౌలు రైతులకు చెక్కులు అందజేసేందుకు వచ్చారు. అయితే అధికార పార్టీ బెదిరింపుల వల్ల 210 కౌలు రైతుల కుటుంబాలు వచ్చాయి. వారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబ పరిస్థితిని పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. పిల్లల చదువుకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “మహనీయులు శ్రీ కాన్షిరాం, విప్లవ ఉద్యమాల్లో పని చేసిన కేజీ సత్యమూర్తి వంటి మహనీయులు అణగారిన వర్గాల అధికారం కోసం ఎంతో కృషి చేశారు. అధికారం దక్కని కులాలకు ఓ దశాదిశా చూపి అధికారం చేపట్టేలా ప్రయత్నాలు చేశారు. అయితే అవి పూర్తిస్థాయిలో సఫలీకృతం కాలేదు. అణగారిన వర్గాల వారు అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటే అగ్రవర్ణాలకు వ్యతిరేకం కాదు. అది మన అధికార పోరాటంగా భావించాలి తప్పితే అది ఇతర కులాలపై ఆధిపత్యంగా భావించకూడదు. జనసేన పార్టీకి బలం ఉన్నప్పటికీ…. కొన్ని కారణాలురీత్యా 2014 కూటమి 2019లో లేదు కాబట్టే వైసీపీ గెలిచింది. అప్పటి కూటమి ఉండి ఉంటే ఒక చెక్ పాయింట్ మాదిరి ఉండేది. బలమైన ప్రతిపక్షంగా పోరాటం అయినా చేసే అవకాశం ఉండేది. అణగారిన వర్గాలకు అధికారం అంటే అప్పటికే అధికారంలో ఉన్న కులాలను తగ్గించడం కాదు. నాకు ఎల్లలు లేవు… కులం, మతం, ప్రాంతం విషయంలో నేను అతీతుడిని అని చాటిన విశ్వ నరుడు రాసిన కవి శ్రీ గుర్రం జాషువా గారిని అమితంగా ఇష్ట పడే వ్యక్తిని. అయితే క్షేత్ర స్థాయి విషయాలు, వాస్తవ పరిస్థితి గురించి నిర్భయంగా మాట్లాడాలి. అందుకే కులాల గురించి మాట్లాడాల్సి వస్తోంది. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న కులాలకు కచ్చితంగా అధికారం అందేలా చూడాలి. దాని కోసం అన్ని కులాలను కలుపుకొని వెళ్తాం. ఈ వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి. మేము ఏదైనా ప్రజా సమస్యల మీద మాట్లాడితే వీరు వ్యక్తిగత విషయాలు మీద ఓండ్ర పెడతారు. వారం వారం వచ్చి రాజకీయాలు చేస్తాను అంటారు. నేను వారానికి ఒకసారి వచ్చి మాట్లాడితేనే మీకు అంత వణుకు పుట్టుకొస్తోంది. ఇక ప్రతిరోజు నేను మీకు కనబడితే ఎలా ఉంటుందో త్వరలోనే తేలుతుంది. చూడండి.. వైసీపీ నాయకుల తాతలు, తండ్రులు అవినీతి చేసి సంపాదించిన డబ్బు నా దగ్గర లేదు. మీలా నాకు వేల కోట్ల విరాళాలు రాలేదు.. నేను కష్టించి సంపాదిస్తేనే నా పార్టీ నడుస్తుంది. అందుకే పొట్ట పోషణకు నాకు నటన తప్పదు. అది ప్రజలు గుర్తించారు.. ఈ వైసీపీ గాడిదలకే అర్థం కావడం లేదు.
* థానోస్ చెప్పినట్లు ఇది వర్గ యుద్ధమే
వైసీపీ నాయకుడు థానోస్ చెప్పినట్లు వచ్చే ఎన్నికలు కుల యుద్ధం కాదు… క్లాస్ (వర్గ) యుద్ధం అన్నారు. ఇది నిజమే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతులేని అవినీతికి పాల్పడిన వైసీపీ వర్గానికి, ఏ అధికారం లేకున్నా బాధిత రైతుల పక్షాన నిలబడి వారికి ఆలంబనగా ఉన్న జనసేన వర్గానికి ఇది పోరాటం. మీరు చెప్పినట్లు… మీ అవినీతికి మా అలంబనకు జరిగే పోరాటం. దానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మీరు చేసిన అవినీతి చాలు… అని సీఎం మంత్రులకు చెప్పడం, అవినీతికి హాలీడ్ ప్రకటించడం మీకే చెల్లింది. ఇప్పటి వరకు దోచుకుతిన్నది చాలు అనుకోవడం కరప్షన్ హాలిడే ప్రకటించడం చాలా సంతోషం.
* బీసీలకు భోజనాలు పెట్టడమే సాధికారికతా?
నేను తూర్పు కాపులతో సమావేశం కాగానే వీళ్లకు బీసీల గర్జన గుర్తు వచ్చింది. బీసీల సాధికారత కోసం వైసీపీ నాయకులు మాట్లాడే విషయాలు ఏంటి అంటే… బీసీలకు చేపల వేపుడు పెట్టాం.. మటన్ బిర్యానీ చేసాం.. రొయ్యల ఫ్రై పెడుతున్నాం అని చెప్తున్నారు. బీసీ వర్గాల సాధికరిత అంటే బీసీ వసతి గృహల్లో మెరుగైన పోషకాహారం పెట్టండి. పిల్లలకు మంచి ఆహారం ఇవ్వండి. బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వండి.. వారికి ఫీజు రీయింబర్సుమెంట్ సకాలంలో అందేలా చూడండి. అప్పుడు మేము మీకు చక్కగా సహకరిస్తాం. మీకు ఎప్పుడు ఇతరులు అంటే విపరీతమైన చిన్న చూపు. వీళ్ళు బిర్యానీలకు అమ్ముడుపోతారు.. వీళ్లకు మంచి ఫిష్ ఫ్రై పెడితే చాలు అనుకునే మనస్తత్వం. అసలు బీసీలకు మీరు చేసిన మేలు ఏంటీ? ఎంత మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు..? ఎంత మందిని పారిశ్రామికవేత్తలు చేశారు..? ఎందరికి ఆర్ధిక భరోసా ఇచ్చారు.. ఆ లెక్కలు చెప్పండి. బీసీ కులాలను అడ్డం పెట్టుకుని కొందరు నాయకులు ఎదుగుతున్నారు తప్పితే, కులం వెనుకపడుతోంది. అలాగే కాపులు, ముస్లింలు సైతం వెనుకబడ్డారు. వారిని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఆలోచించండి.
* వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వం అన్న దానికి కట్టుబడి ఉన్నాం
రాజకీయాల్లో దామాషా పద్ధతి లేదు. దీంతో అణగారిన వర్గాల ఓట్లు పూర్తిగా చీలిపోయి ప్రజల ఆస్తులు దోపిడీ చేసే ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇలాంటి కులాలన్నింటినీ కలిపి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పొల్లు పోకుండా చేయడమే లక్ష్యం. ఈ పద్ధతిలో నన్ను ముఖ్యమంత్రిని చేస్తారా చేయరా.. అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా, మళ్లీ ఈ ప్రభుత్వం రాకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. ఇదే ప్రభుత్వం మళ్ళీ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించడం దేవుడు తరం కూడా కాదు అన్నదే నా బాధ. రాష్ట్రం పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ రాకుండా చూసే బాధ్యతను తీసుకుంటాం.
* అంబటి… కాపుల గుండెలపై కుంపటి
రైతులకు ఈ ప్రభుత్వం సహాయం అందించదు. రూ. 7 లక్షలు వచ్చే రైతుల వద్దకు వెళ్లి దానిలో రెండు లక్షలు ఇవ్వాలని అవినీతి చేసే వారిని ఏమనాలి..?శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా ఉంది అధికార ఎమ్మెల్యే తీరు. అంబటి రాంబాబు గారిపైన నాకు వ్యక్తిగత ద్వేషం లేదు. చేసే అవినీతి పనులు, తీరు మీదనే కోపం. అంబటి రాంబాబు గారు ముందు పోలవరం పూర్తి చేయడంపై దృష్టి సారించాలి. కీలకమైన శాఖ బాధ్యతలు ఏమున్నాయో తెలుసుకోవాలి. ఈ వ్యక్తి కాపులు గురించి మాట్లాడుతాడు. నన్ను తిట్టడానికి ముందుకు వస్తాడు. అంబటి కాపుల గుండెలపై కుంపటిలా తయారయ్యాడు. గత ఎన్నికల్లో ఇదే సత్తెనపల్లిలో రాజుపాలెం అనే గ్రామంలో ఆ గాజు గ్లాసు నా గుండెల్లో బాకులా గుచ్చుకుంటుంది అన్నారు… కచ్చితంగా ఈసారి గాజు గ్లాసు గునపంలా దిగబడుతుంది.
* ప్రతి పైసాకు లెక్క చెబుతాం
నా సొంత డబ్బునే ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తిని. ఎదుట మనిషి కష్టాల్లో ఉన్నట్లు కనిపిస్తే వెంటనే ఆదుకోవాలి అన్న స్పృహ ఉన్న మనిషిని. అలాంటి మాకు రాష్ట్ర ఖజానా అప్పగిస్తే దాన్ని ఎంత జాగ్రత్తగా నిర్వహిస్తామో మీరే చూస్తారు. ఖజానాలోని ప్రతి పైసాకు ప్రజలకు లెక్క చెబుతాం. ప్రతి విషయం మీద కచ్చితంగా జనసేన ప్రభుత్వంలో శ్వేతపత్రం విడుదల చేస్తాం. ప్రజల ఆస్తులకు రక్షకులుగా నిలబడతాం. ప్రభుత్వంలో జరిగే ప్రతి విషయాన్ని పారదర్శకంగా ప్రజలకు తెలియజేస్తాం. ఏ చిన్న తప్పు జరిగినా నన్ను చొక్కా పట్టుకొని నిలదీసే హక్కును మీకు కల్పిస్తాం. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి ఆస్తులకు భద్రతకు పూర్తి బాధ్యతను మేము తీసుకుంటాం. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయం మీద ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించే బాధ్యత మా ప్రభుత్వంలో తీసుకుంటాం.
* ఉద్యోగార్థులకు వయోపరిమితి మేం పెంచుతాం
వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ మీద మాట తప్పింది. ఇప్పుడు పోలీసు ఉద్యోగాలు సుమారు మూడున్నర సంవత్సరాల తర్వాత తీశారు. దీనికి ఎప్పటినుంచో సన్నద్ధమవుతున్న యువత వయసు దాటిపోయి ఇప్పుడు ఇబ్బందిపడుతున్నారు. వారి భవిష్యత్తుకు ఎవరు సమాధానం చెబుతారు. మీరు పూర్తిస్థాయిలో మాట తప్పి జాబ్ క్యాలెండర్ను పూర్తిగా పక్కన పెట్టారు కాబట్టి… కచ్చితంగా ఇప్పుడు ప్రకటించిన ఉద్యోగాల్లో వయో పరిమితిపై యువత కోరుతున్న సడలింపు ఇవ్వాలి. ఇప్పుడు తీసే ప్రతి ఉద్యోగం పైన వయో సడలింపు కచ్చితంగా చేయాలి. అలా చేయకుంటే కచ్చితంగా కొత్త ప్రభుత్వంలో యువతకు తగిన విధంగా న్యాయం చేస్తాం. ఉద్యోగాల్లో వయో సడలింపు తీసుకువచ్చే బాధ్యత వచ్చే జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. బెదిరించే నాయకులు ఉంటే ఎదిరించే యువతరం ఉండాలి ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. యువతరం శక్తి చాలా గొప్పది. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నేను రెచ్చగొట్టను. కానీ ఏదో ఒక రోజు పిలుపునిస్తాను.. ఒక ఉప్పెనలా ఈ ప్రభుత్వం తీరు నిరసించే రోజు వస్తుంది. యువత నుంచి కొత్త యువ నాయకత్వం రావాలి. వైసీపీ నాయకులు కేవలం వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారు నా ఆలోచన అంతా భవిష్యత్తు తరాల కోసం ఉంటుంది. నాకు ఏ పార్టీ మీద కానీ ఏ వ్యక్తి మీద కానీ ప్రేమ ఉండదు ద్వేషం ఉండదు… నాది కేవలం ప్రజా బాట. ప్రజలకు ఏది అవసరమో దాని గురించి మాత్రమే పోరాడుతాను. ప్రజల కోసం మాటిచ్చి తప్పిన వారితో కచ్చితంగా గొడవ పడతాను. అలాగే ప్రజల కోసం మంచి చేసే వారిని ప్రేమిస్తాను. గతంలో తెలుగుదేశం పార్టీతోనే పోట్లాడినవాడిని. నాకు ఇతర ఎలాంటి అవసరాలు, ఆశలు లేవు. కేవలం ఈ ప్రజా సమూహానికి ఏదైనా చేయాలి… నేను నడిచిన ఈ నేలకు నా సమాజానికి ఇంకా ఏదో మంచి చేయాలి అన్నదే నా అభిలాష. నా ఒక్కడి కష్టం వల్ల కేవలం కొద్ది మందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాను.. అదే అధికార పీఠం జనసేన పార్టీకి ఇస్తే కొన్ని కోట్లాది మందికి ప్రజాధనం ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగం అయ్యేలా చూస్తాను.
* నా వ్యూహం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే
నేను ఎవరికీ కొమ్ము కాయవలసిన అవసరం లేదు. దేనినో ఆశించి రాజకీయాలను వాడుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా ఆలోచన, నా వ్యూహం అన్ని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసమే. ప్రజలందరూ నిబంధనలు పాటించాలని నీతులు చెప్పే రాజకీయ నాయకులు వాటిని ఏమాత్రం పాటించకుండా అవినీతి డబ్బు జేబులో వేసుకుంటున్నారు. యువతలో అంతులేని బాధ ఉంది. సమర్థవంతమైన పాలన వ్యవస్థ ఉంటేనే యువత వేదనను తీర్చే అవకాశం ఉంటుంది. కౌలు రైతులకు ముఖ్యంగా జనసేన ప్రభుత్వంలో పూర్తిస్థాయి అండగా ఉంటాం. మాకు అన్నం పెట్టిన అన్నదాతను ఏమాత్రం విస్మరించం. పటిష్టమైన ప్రభుత్వ పాలసీ విధానాలను రైతుల కోసం తీసుకువస్తాం.
* మాచర్ల లాంటి హింస రాబోయే రోజుల్లో మరింత ఉంటుంది
వచ్చే ఎన్నికల్లో అధికారం దూరం అవుతుంది అని వైసీపీ నాయకులకు తెలుసు. దీనికోసం వైసీపీ నాయకులు ఘోరాలు ఇంకా చాలా చేస్తారు. మాచర్ల లాంటి ఘటనలు చాలా జరుగుతాయి. కార్యాలయాలపై దాడులు చేసి, దహనాలు చేస్తారు. వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది. కచ్చితంగా జనసేన నాయకులు బలంగా పోరాడాలి. భయపడకుండా ముందుకు వెళ్లాలి. ప్రజాక్షేత్రంలో నిలబడండి. నా మీద లాఠీ పడి రక్తం చిందించడానికైనా, జైలులో కూర్చోవడానికి అయినా సిద్ధంగా ఉన్నాను. నా సినిమాలు ఆపేసుకున్నా ఆపేసుకోండి.. నన్ను మీ బెదిరింపులు ఏమి చేయలేవు. నేను బంతి లాంటి వాడిని ఎంత కొడితే అంత బలంగా పైకి లేస్తా. జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి. దశాబ్దం నుంచి నా కష్టంతోనే పార్టీ నడుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎన్నికల వ్యూహం నాకు వదిలేయండి. జనసేన పార్టీని ముందుండి అధికారం దిశగా నడిపించే బాధ్యత నేను తీసుకుంటాను. నన్ను నమ్మండి. వారాహి మీద ఆంధ్రప్రదేశ్ రోడ్లమీద తిరుగుతాను.. ఎన్నికల క్యాంపెయిన్ చేస్తాను ఎవరు ఆపుతారో చూద్దాం” అన్నారు.