వారం రోజుల గడువిస్తున్నా.. స్పందించకపోతే ఉద్యమం తప్పదు: పవన్‌ కళ్యాణ్

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసి చేతులు దులిపేసుకుని కూర్చుంటే సరిపోదని… కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా అఖిలపక్షం ఏర్పాటుచేసి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ సూచించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో జనసేన ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. వారం రోజులు గడువిస్తున్నానని… ఆలోగా వైకాపా తన వైఖరి వెల్లడించకపోతే తాను ఉద్యమాలకు దిగక తప్పదన్నారు. విశాఖ ఉక్కు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఏర్పాటుచేసింది కాదని, 32 మంది బలిదానాలతో ఏర్పడిందని, వాటిని వృథా కానివ్వనని తేల్చిచెప్పారు. వైకాపా ఎంపీల అవసరం భాజపాకు లేదని చెబుతున్నారని అలాంటప్పుడు సీఏఏ, రైతుచట్టాల్లాంటి బిల్లులకు ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించారు. వినతిపత్రాలు ఇవ్వడం, ఒకసారి పాదయాత్ర, లేఖలు రాయడం, అసెంబ్లీలో తీర్మానం తప్ప గత 9నెలల్లో వైకాపా చేసిందేమీ లేదన్నారు. ‘వైకాపా అనుకుంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగుతుంది. రాజ్యసభ ఛైర్మన్‌పై అభాండాలు వేశారు. సీజేఐ కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మీరు ఉక్కు ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేరు’ అని నిలదీశారు. నీలం రంగు లైట్లున్న కార్లలో తిరగడానికి, కాంట్రాక్టులు, పదవులు పొందడానికే అధికారాన్ని వినియోగిస్తున్నారని దుయ్యబట్టారు. ‘కేంద్రం తమ మాట వినదంటున్నారని… మరి పదవులు, కాంట్రాక్టులు, బెయిళ్లు పొందడానికి మాత్రం మీ మాటలు వింటుందా’ అని ఎద్దేవా చేశారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను పోరాడానని, ఆ తరువాత ప్రైవేటీకరణ నిలిచిపోయిందని గుర్తుచేశారు. డీసీఐకి చెందిన వెంకటేశ్‌ అనే ఉద్యోగి బలిదానంతో తాను అప్పట్లో ఉద్యమానికి దిగానన్నారు.

విశాఖ ఉక్కునగరంలో నిర్వహించిన సభలో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్‌. వేదికపై జనసేన నేత నాదెండ్ల మనోహర్‌, ఉక్కు పోరాట కమిటీ నాయకులు పవన్‌ కల్యాణ్‌ సభకు హాజరైన కార్మికులు, ప్రజలు, పార్టీ శ్రేణులు

రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయాలి

’22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలున్నారు… అవసరమైతే రాజీనామాలు చేస్తామనీ చెప్పారు. మరి ఎందుకు చేయట్లేదు? రాష్ట్ర విభజన జరిగినప్పుడూ నాటి ఎంపీలు మాట్లాడలేదు. మన సమస్యలపై మనం పోరాడకపోతే, నిరసనలు తెలపకపోతే కేంద్రానికి పరిస్థితి తీవ్రత ఎలా తెలుస్తుంది? కేంద్రాన్ని అడగబోయే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యుల్ని చేయాలి. వాస్తవానికి ప్రైవేటీకరణ 1991 నుంచే ప్రారంభమైంది’ అని వివరించారు.

వైకాపా మాటలకు అర్థాలే వేరులే

వైకాపా ప్రజలకు ఒకటి చెబుతూ, దానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందని పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. ‘సంపూర్ణ మద్యనిషేధం అని చెప్పి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. ఉచితవిద్య అంటూ వేలాది మంది పేద పిల్లలు చదివే ఎయిడెడ్‌ పాఠశాలల్నే ఎత్తేస్తున్నారు. జాబ్‌ క్యాలెండర్‌ అంటారు.. అసలు ఉద్యోగాలే లేకుండా చేస్తారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. వైకాపా మాటలకు అర్థాలే వేరులే’ అంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ పోరాటమే నాకు స్ఫూర్తి

‘తెలంగాణ ప్రజల పోరాట పటిమే నాకు స్ఫూర్తి. పోరాట సమయంలో అక్కడి ప్రజల్లో కసి, కోపం, ఆవేదన కనిపించాయి. నేను 25 ఏళ్లు పోరాడాలని నిర్ణయించుకున్నా. అందులో వెనక్కి తగ్గేది లేదు. గాజువాక ప్రజలు నన్ను ఓడించినా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం వచ్చాను. నాకు వచ్చిన పదివేల ఓట్లే నాకు అద్భుతం. ప్రజల హృదయాల్లో స్థానం కన్నా పెద్ద పదవి ఇంకేముంది? నా పార్టీ నుంచి ఒక్క ఎంపీని గెలిపించినా నేను పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చర్చించేవాడిని’ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని, దాన్ని కాపాడుకోలేకపోతే బతకడం వృథా అంటూ గద్గదస్వరంతో ప్రసంగించారు. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’, ‘జై ఆంధ్రా… జైజై ఆంధ్రా అనే నినాదాలు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా మారుమోగాలన్నారు.

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం నిలబడాలన్నారు. ముఖ్యమంత్రి ఉక్కు కర్మాగారం కోసం నిజాయతీగా పోరాడాలన్నారు. వారు దేనికి భయపడుతున్నారో? ఎందుకు భయపడుతున్నారో? ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. లాభాలు పెరిగినా ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు విక్రయిస్తున్నారని ప్రశ్నించారు.

భారీ ర్యాలీ

అంతకుముందు విశాఖ విమానాశ్రయం నుంచి ఉక్కు కర్మాగారం సభాస్థలి వరకు భారీ ర్యాలీతో పవన్‌కల్యాణ్‌ వచ్చారు. మార్గమధ్యంలో ఉక్కు కర్మాగారం కోసం బలిదానాలు చేసిన వారి స్మారకచిహ్నం వద్ద నివాళులు అర్పించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌ నరసింగరావు, కన్వీనర్‌ అయోధ్యరామ్‌, పలు సంఘాల నేతలు, తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు అన్ని జిల్లాల జనసేన నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు.