ప్రజా సమస్యలపై పోరాడితే రౌడీ ముద్ర వేస్తారా?: ఆళ్ళ హరి

  • ప్రజా సమస్యలపై పోరాడినవాళ్ళు రౌడిలైతే … ప్రజాధనాన్ని దోచుకున్నవాళ్లని ఏమంటారు?
  • ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఆర్ధిక, క్రిమినల్ కేసులున్న శాసనసభ్యులు లేరు
  • ఓటమి కళ్ళముందు కదలాడుతుండటంతో వైసీపీ నేతల్లో అలుముకున్న నిరాశానిస్పృహలు
  • వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం జనసేన పోరాటం చేస్తూనే ఉంటుంది
  • గుంటూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకలతో, దాష్టీకాలతో ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతమని, వైసీపీ దురాగతాలను అడ్డుకుంటూ ప్రజల పక్షాన పోరాడేవారిని రౌడీలతో పోల్చుతారా అంటూ వైసీపీ నేతలపై గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మండిపడ్డారు. జనసేన పార్టీని రౌడీసేన అంటూ ముఖ్యమంత్రితో పాటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించటం వారిలో దాగున్న ఓటమి భయాన్ని తెలియయచేస్తుందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ఫ్యాక్షనిజం, గుండాయిజం, ప్రజాధన దోపిడీ చరిత్ర కలిగి జైలు జీవితాలు సైతం అనుభవించినవాళ్లే ఇతరులను రౌడీలు అనటంపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ప్రస్తుత వైసీపీ బడా చోటా నేతల్లోనూ సాక్ష్యాత్తు ముఖ్యమంత్రితో పాటూ ఎంతోమంది శాసనసభ్యుల పైనా అవినీతి, క్రిమినల్ కేసులు ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. నేరాలు తాము చేసి వాటిని ఇతరులపై నెట్టడంలో వైసీపీ నేతలు సిద్ధహస్తులని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గం వారూ ఆనందంగా లేరని, ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులు అందరూ ఈ అరాచక పాలనతో విసిగివేసారి పోతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన గొంతెత్తుతున్న జనసేన పార్టీ నేతల్ని, జనసైనికుల్ని రౌడీలతో పోల్చటం వైసీపీ నేతల నీచత్వానికి నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేవాళ్ళు రౌడిలైతే ప్రజాధనాన్ని దోచుకుంటూ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన వాళ్ళని ఏమంటారో చెప్పాలన్నారు. ప్రజాదరణ కోల్పోయి రానున్న ఎన్నికల్లో ఓటమి కళ్ళముందే కనిపిస్తుండటంతో వైసీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. పరిపాలన చేతకాక ఇప్పటికే చరిత్ర హీనులుగా మిగిలిపోయారని ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైసీపీ నేతలకు ఆళ్ళ హరి హితవు పలికారు.