ఎమ్మార్ నగరంలో ఆధార్ మార్పిడితో అక్రమ పింఛన్లు…!

  • దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలి
  • తుఫానుకి పార్వతీపురం ముంపుకు గురికాకుండా చర్యలు చేపట్టాలి
  • ఐటీడీఏ పీఓని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం మండలంలోని ఎమ్మార్ నగరం గ్రామ సచివాలయ పరిధిలో ఆధార్ కార్డులో వయస్సు మార్పిడి చేసి అక్రమంగా పింఛన్లు పొందుతున్నారని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణు చరణ్ తో జనసేన పార్టీ నాయకులు అన్నాబత్తుల దుర్గాప్రసాద్, వంగల దాలినాయుడు తదితరులు ఈ విషయమై చర్చించారు. గత కొంతకాలంగా ఆధార్ కార్డులో తక్కువ వయస్సును, ఎక్కువ చేసి అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 27 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. ఇంకా మరికొన్ని ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ మేరకు ఆధారాలతో కూడిన వివరాలను అందజేశారు. దీనికి స్పందించిన ఐటీడీఏ పీవో సి.విష్ణుచరణ్ దీనిపై దర్యాప్తు చేయాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పార్వతీపురం పట్టణం తుపాను ముంపుకు గురికాకుండా చూడాలి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏమాత్రం వర్షం పడిన పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్డుతో పాటు సౌందర్య సినిమా హాలు ప్రాంతము, నెల్లిచెరువు గట్టు, బైపాస్ కాలనీ, జనశక్తి కాలనీ తదితరవి ముంపుకు గురవుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో వర్షపు నీరు ప్రవహించేందుకు ఉన్న మురుగు కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్డుపై కొచ్చి ముంపుకు గురి చేస్తోందన్నారు. తక్షణమే పట్టణ మెయిన్ రోడ్డులో ఉన్న ఇరువైపులా మురుగు కాలువలపై ఆక్రమణలు తొలగించి వర్షపు నీరు ప్రవాహానికి అడ్డులేకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరహాలు గెడ్డ ప్రాంతాన్ని నీటి ప్రవాహానికి అనుకూలంగా మలచాలన్నారు. అలాగే బైపాస్ కాలనీలో ఉన్న వసతి గృహాన్ని మార్చాలన్నారు. దీనిపై వినతిపత్రం అందజేస్తారు తగు చర్యలు తీసుకుంటామని పిఓ హామీ ఇచ్చారు.