మంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలి: ఆళ్ళ హరి

  • రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చారు
  • రాష్ట్రంలోనే అతిపెద్ద జూదగాడు అంబటి రాంబాబు
  • అంబటి రాంబాబు లాటరీ వ్యవహారంపై కోర్టు ఉత్తర్వుల పట్ల హర్షం వ్యక్తం చేసిన జనసేన పార్టీ
  • పేద ప్రజల రక్తాన్ని జలగలా తాగుతున్న వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: సంక్రాంతి సంబరాల పేరిట నిషేధిత లాటరీ వ్యాపారం చేసి పేద ప్రజలను దోచుకున్న మంత్రి అంబటి రాంబాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో స్వయంగా మంత్రే రంగంలోకి దిగి లాటరీలను కొనాలని హుకుం జారీచేయటం పట్ల గతవారం జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టుని ఆశ్రయించారన్నారు. ఈ నేపధ్యంలో అంబటి రాంబాబు లాటరీ దందాపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బుధవారం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పట్ల జనసేన పార్టీ హర్షం వ్యక్తం చేస్తుందని ఆళ్ళ హరి తెలిపారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ కాదేదీ కవితకు అనర్హం అన్నట్లుగా దోచుకోవటానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా వైసీపీ నేతలు దోపిడీలకు, దందాలకు తెర తీశారని విమర్శించారు. భూకబ్జాలు, మైనింగ్, గంజాయి, ఎర్రచందనం, అక్రమ మద్యం ఇలా రాష్ట్రాన్ని సమస్తం దోచుకుంటున్నా వైసీపీ నేతలకు ఇంకా ధనదాహం తీరట్లేదని ధ్వజమెత్తారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు లాటరీల పేరుతో పేదల్ని నిలువుదోపిడీ చేస్తున్నారని విమర్శించారు. వాలంటీర్ల సాయంతో సామాజిక పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారితో బలవంతంగా లాటరీలను కొనిపించటం దారుణమన్నారు. ఈ లాటరీల్లో ముప్పై లక్షల బహుమతులు పెట్టి దాదాపు రెండు కోట్ల రూపాయల లాటరీలను అమ్మారన్నారు. ఎవరికైనా సంక్రాంతి అనగానే బంధువులు, పిండివంటలు, రంగవల్లులు, డూ డూ బసవన్నలు, హరిదాసులు గుర్తుకువస్తారని, అంబటికి మాత్రం కోడిపందాలు, మద్యం, పేకాట, లాటరీలు గుర్తుకువస్తాయని దుయ్యబట్టారు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు శాసనసభ్యుడిగా ఎన్నికకావటం, మంత్రి కావటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని ఆళ్ళ హరి అన్నారు.