ఆచరణ సాధ్యం కాని టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో..

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కానిదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సోమవారం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అక్షరం పొల్లుపోకుండా పాత మేనిఫెస్టోనే మళ్లీ ప్రకటించారని చెప్పారు. అధికార పార్టీ పాత, కొత్త మేనిఫెస్టోల మొదటి పేజీలను గమనిస్తే.. వాటిలోని డొల్లతనం బయటపడుతుందన్నారు. సెలూన్లు, ధోబీ ఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్తు హామీ గత ఎన్నికల్లో ఇచ్చిందేనని గుర్తు చేశారు. రేషన్‌కార్డులు ఇవ్వడానికి ఆరేళ్లు ఎందుకు పట్టిందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఐదేళ్లలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే పాత మేనిఫెస్టోనే మళ్లీ ఎందుకు ప్రకటించారని నిలదీశారు. టీఆర్‌ఎస్‌ మాటలకు చేతలకు పొంతనలేదని విమర్శించారు. విశ్వనగరాన్ని విషాదనగరంగా మార్చారని మండిపడ్డారు.

కొత్త ఎన్నికల ప్రణాళిక రూపొందించుకునేందుకు టీఆర్‌ఎ్‌సకు సమయం దొరికినట్టు లేదని, అందుకే పాత మేనిఫెస్టోనే మళ్లీ ముద్రించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళిక నీటి బుడగను తలపిస్తోందని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇతర పార్టీల మీద విరుచుకుపడడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.67వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు గానీ.. ఎక్కడ వెచ్చించారో చెప్పడం లేదని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం బీజేపీ చేయదని స్పష్టం చేశారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఆగిపోయిందని ఆరోపించారు.