రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మద్దతు జనసేన పార్టీకే..

  • దక్షిణ ఇండియా కాపు అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసి నాయుడు

ఎస్ కోట: హరిరామజోగయ్య చేపట్టిన సర్వే నివేదిక ప్రకారం రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం యొక్క మద్దతు జనసేన పార్టీకే అత్యధికంగా ఉందని దక్షిణ ఇండియా కాపు అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షులు వబ్బిన సన్యాసి నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ ఇటీవల హరి రామ జోగయ్య రాష్ట్రంలో కాపు, ఎస్సీ, బిసీ సామాజిక వర్గాల ఓట్ల శాతంపై, అలాగే ఏ ఏ సామాజిక వర్గం రాష్ట్రంలో ఏ ఏ పార్టీకి ఎంత శాతం మద్దతిస్తుందని సర్వే చేపట్టినట్లు ఆయన తెలిపారు. కాపు సామాజిక వర్గం విషయానికి వస్తే జనసేన పార్టీకి 80 శాతం కాపులు మద్దతు ఇస్తున్నారని, తెలుగుదేశం పార్టీకి 8 శాతం అలాగే వైసిపి పార్టీకి 12 శాతం మద్దతు ఇస్తున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా బీసీ ఓట్ల విషయానికి వస్తే జనసేన పార్టీకి 25 శాతం, తెదేపాకు 40 శాతం, వైసిపి కు 35 శాతం మద్దతు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి జనసేన పార్టీకి 26 శాతం తెదేపాకు 14 శాతం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 60 శాతం మద్దతు ఉన్నట్లు హరిరామజోగయ్య సర్వే నివేదిక చెబుతున్నట్లు సన్యాసి నాయుడు తెలిపారు.