ఏడాది గడిచే సరికి బంగారు వాసాలమర్రి కావాలి: కేసీఆర్‌

ఏడాది గడిచే సరికి గ్రామం బంగారు వాసాలమర్రి కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా వాసాలమర్రి గ్రామస్తులతో కలిసి సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. ఇక భోజనం చేస్తున్న మహిళల వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భోజనాలు ఎలా ఉన్నాయని అడిగారు. కేసీఆర్ ఒక సామాన్యుడిలా వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలుకరించడంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలోని 3 వేల మందికి ఒకేసారి భోజన ఏర్పాట్లు చేశారు. వాసాలమర్రిలోని కోదండ రామాలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.

కేసీఆర్ రాక సందర్భంగా వాసాలమర్రి గ్రామస్తులకు 23 వంటకాలను వడ్డించారు. మటన్, చికెన్, ఆకుకూరలు, బోటీ కర్రి, చేపలు, తలకాయ కూర, కోడిగుడ్డు, రెండు రకాల స్వీట్లు, పాలక్ పన్నీరు, బిర్యానీ, పులిహోర, సాంబార్, పండ్ల రసాలు, ఆలుగడ్డతో పాటు పలు వైరెటీలు చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని 421 గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వాసాలమర్రి పుణ్యమా అని జిల్లాలోని గ్రామాలు అభివృద్ధి అవుతున్నాయి. ముఖ్యమంత్రి నిధి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 25 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాను. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు కూడా నిధులు మంజూరు చేస్తాను. భువనగిరి మున్సిపాలిటికీ రూ. కోటి, మిగతా ఐదు మున్సిపాలిటీలకు రూ. 50 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

త్వరలో గ్రామ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేయాలి. అధికారులు వచ్చి ప్రతి ఇంటి పరిస్థితిని అధ్యయనం చేయాలి. వాసాలమర్రికి కూడా వంద గ్రామాల ప్రజలు వచ్చి అభివృద్ధి నేర్చుకోని పోవాలన్నారు. ఈ గంట నుంచి కులం లేదు, మతం లేదు, జాతి లేదు. మనందరిది ఒకటే కులం. మనది అభివృద్ధి కులం, బాగుపడే కులం అని సీఎం పేర్కొన్నారు. ఇలా ముందుకుపోతే తప్పకుండా విజయం సాధిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.