బత్తినపాడు గ్రామంలో జనసేన జెండా దిమ్మె ఆవిష్కరణ

నందిగామ, కంచికచర్ల మండలంలోని బత్తినపాడు గ్రామంలో బత్తినపాడు గ్రామ జనసేన పార్టీ నాయకుడు గొర్రె ముచ్చురాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా దిమ్మె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, కృష్ణ పెన్నా కోఆర్డినేటర్ రావి సౌజన్య, ఉపాధ్యక్షుడు బోలియశెట్టి శ్రీకాంత్, లీగల్ సెల్ విభాగం కిరణ్ లు పాల్గొన్నారు. ముందుగా బత్తినపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బత్తినపాడు రహదారి ప్రక్కన ఏర్పాటు చేసిన జండా దిమ్మ ఆవిష్కరించారు. అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కేకు కట్ చేసి అందరికీ అందించారు. ఈ సందర్భంగా బండ్రెడ్డి రామకృష్ణ మాట్లాడుతూ గత ఎన్నికల్లో బత్తినపాడు గ్రామం నుండి ఒంటరిగా పోటీ చేసిన రాజును ప్రత్యేకంగా అభినందించారు. బత్తినపల్లి గ్రామ ప్రజలు రాజుకు అండగా నిలవాలని కోరారు. కులమతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపించేందుకు పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారని ఆయన అన్నారు. రావి సౌజన్య మాట్లాడుతూ బత్తినపాడు గ్రామ ప్రజలు జనసేన పార్టీని మనస్పూర్తిగా ఆహ్వానించి ఆదరించాలని జనసేన పార్టీ గెలుపు తమ గెలుపుగా భావించాలని కోరారు. జనసేన పార్టీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అందుబాటులోకి వస్తామని ఆమె తెలిపారు. ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామంలోకి వెళ్తుంటే రహదారి అధ్వానంగా ఉందని రాళ్లతో కూడిన దారిలో వెళ్తుంటే దుమ్ము లేచి ప్రయాణం కష్టతరంగా ఉందని అన్నారు. పాలకులు నిర్లక్ష్యానికి బత్తిన పాడు గ్రామం గురవుతుందని జనసేన పార్టీ గెలిపిస్తే అభివృద్ధి ఆ రోడ్డును నిర్మించడం నుండే మొదలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపాలెం ఎంపీటీసీ పోలిశెట్టి తేజ, కంచికచర్ల మండల అధ్యక్షుడు నాయిని సతీష్, వీరులపాడు మండల అధ్యక్షుడు బేతంపూడి జయరాజు, చందర్లపాడు మండల అధ్యక్షుడు వడ్డెల్లి సుధాకర్ ఇతర జనసైనికులు పాల్గొన్నారు.