*కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఘనంగా వేడుక
*గురువారం రాత్రి న్యూఢిల్లీ నుండి వియత్నాం ప్రదర్శనకు బుద్ధ భగవానుని అవశేషాలు తరలింపు కార్యక్రమం
హుచిమిన్ సిటీ, వియత్నాం: భారతదేశం మరియు వియత్నాం దేశాల మధ్య సాంస్కృతిక మరియు అధ్యాత్మిక అనుబంధాన్ని మరింత బలపరిచే ఉద్దేశంతో, బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలు ఘనంగా వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు మరియు మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వం వహించారు. గురువారం రాత్రి న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బుద్ధుని పవిత్ర అవశేషాలను ఐఏఎఫ్ హెర్క్యులస్ విమానంలో విశేష భద్రతతో వియత్నాం తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం, వియత్నాం బౌద్ధ విశ్వవిద్యాలయంలోని బుద్ధ హాల్‌లో, భక్తిశ్రద్ధలతో, వేడుకల నడుమ అవశేషాలను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ గారు మాట్లాడుతూ, “బుద్ధుని పవిత్ర అవశేషాలను విదేశీ భూమిలో ప్రతిష్ఠించడం ఒక మహత్తర ఘనత. ఇది భారతీయ నాగరికత, శాంతియుత జీవనవిధానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ పవిత్ర ప్రయాణంలో భాగస్వామ్యం కావడం నాకు గర్వకారణం” అని తెలిపారు. మే 1 నుంచి 6వ తేదీ వరకు, వియత్నాంలో ఈ అవశేషాల ప్రదర్శన జరుగనుండగా, హుచిమిన్ నగరంలోని బౌద్ధమత అనుచరులు వాటిని దర్శించుకునే అవకాశం పొందనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా భారత దేశం నుండి వెళ్లిన బౌద్ధ సంప్రదాయాన్ని మరింత విస్తృతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా ఉందన్నారు మంత్రి దుర్గేష్.
Share this content:
Post Comment