రోజురోజుకు పెరుగుతున్న చలితీవ్రత

హైదరాబాద్‌ నగరంలో చలితీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పగటివేళలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిప్రభావం విపరీతంగా ఉంటోంది. సాయంత్రం 4 గంటల నుంచి చల్లనిగాలులు వీస్తుండడంతో పిల్లలు, వృద్ధులు, రోడ్లపై నుంచి వెళ్తున్న వాహనదారులు, చిరువ్యాపారులు చలికి వణికిపోతున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా తూర్పు, ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్న కారణంగా చలి పెరుగుతోందని, మరికొన్ని రోజుల వరకూ ఇలాంటి పరిస్థితే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. చలి ప్రభావానికి రాత్రి 10 తర్వాత నుంచి నగరంలోని పలు రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.