వాతావరణ ఒప్పందానికి భారత్‌ సవరణ

భూతాప కట్టడిపై రెండు వారాల చర్చోపచర్చల అనంతరం ప్రపంచ దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయి.

పుడమి ఉష్ణోగ్రతల నియంత్రణకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సజీవంగా ఉంచుకునేందుకు రాజీ ధోరణితో దీనికి సమ్మతించాయి. బ్రిటన్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న ఐరాస వాతావరణ సదస్సు (కాప్‌ 26) ప్రతిపాదించిన ఈ ఒప్పందాన్ని దాదాపు 200 దేశాలు ఆమోదించాయి. బొగ్గు వాడకంపై భారత్‌ ప్రవేశపెట్టిన సవరణను అందులో పొందుపరచడం విశేషం. ఒప్పంద ముసాయిదాలో మొదట బొగ్గు వాడకాన్ని ‘దశలవారీగా నిలిపేయాల’ని ప్రతిపాదించగా, దాన్ని ‘దశలవారీగా తగ్గించాల’ని భారత్‌ సూచించింది. ఈ ఒప్పందం ఏకగ్రీవంగా కుదరాలి కాబట్టి భారత సూచనను అందులో పొందుపరచక తప్పలేదు. ఈ సవరణపై పలు దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
వర్థమాన దేశాలు ఆర్థికాభివృద్ధి సాధించాలన్నా, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాలన్నా మరికొంతకాలం విద్యుదుత్పాదనకు బొగ్గు వాడకాన్నీ, చమురు, సహజవాయు సబ్సిడీలను కొనసాగించక తప్పదని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌ స్పష్టం చేశారు. ఉదాహరణకు భారతదేశంలో వంటగ్యాస్‌ను సబ్సిడీపై సరఫరా చేస్తున్నందున పేదలు కట్టెలు, బయోమాస్‌ వాడకానికి స్వస్తి చెప్పగలిగారని తెలిపారు. దీనివల్ల వంటగదిలో కాలుష్యకారక పొగలు తగ్గి ప్రజారోగ్యం మెరుగుపడిందని గుర్తుచేశారు. సంపన్న దేశాలు మొదటినుంచీ బొగ్గు, చమురును పెద్దఎత్తున వాడటం వల్లే ఆర్థికంగా పురోగమించాయని చెప్పారు. ఈ శిలాజ ఇంధనాలను బాధ్యతాయుతంగా వాడుతూ అభివృద్ధి సాధించే హక్కు వర్థమాన దేశాలకూ ఉందని వాదించారు. సంపన్న దేశాల విలాసవంతమైన జీవిత విధానం, దుబారాల కారణంగానే నేడు కర్బన ఉద్గారాలు ప్రమాదకర స్థాయికి చేరాయన్నారు. ప్రతి దేశం తన జాతీయ పరిస్థితులు, బలాలు, బలహీనతలకు అనుగుణంగా కర్బన ఉద్గారాల విషయంలో ‘నెట్‌ జీరో’ స్థాయికి చేరుకుంటుందని పేర్కొన్నారు. దీంతో కాప్‌ 26 వాతావరణ ఒప్పందం బొగ్గు వాడకాన్ని దశలవారీగా తగ్గించాలనే పదబంధాన్ని ఉపయోగించడం అనివార్యమైంది. అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న దేశాలు వచ్చే ఏడాది చర్చల్లో తమ ఉద్గారాల్లో భారీ కోతను ప్రతిపాదించి, అందుకు కట్టుబడి ఉంటామని హామీ ఇవ్వాలని ఒప్పందం నిర్దేశిస్తోంది. ప్రపంచ దేశాలు కాప్‌ 26 సదస్సులో పురోగతి సాధించామని ప్రకటించాయే తప్ప విజయం సాధించామని చెప్పలేకపోయాయి.

భారత్‌ ప్రతిపాదనపై సణుగుళ్లు
బొగ్గు వాడకాన్ని దశలవారీగా నిలిపేయడం కాకుండా దశలవారీగా తగ్గించాలన్న భారత్‌ వైఖరిని కొన్ని దేశాలు తప్పుపట్టాయి. గ్లాస్గో వాతావరణ ఒప్పందం ఆశించినంత పటిష్టంగా లేకపోయినా, బొగ్గు వాడకం ముగియనున్నదని సూచించడం స్వాగతించాల్సిన విషయమని స్వచ్ఛంద సంస్థ ‘గ్రీన్‌ పీస్‌ ఇంటర్నేషనల్‌’ ప్రతినిధి జెనిఫర్‌ మోర్గన్‌ అన్నారు. మొత్తం మీద భూతాపాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న లక్ష్యం కొడిగట్టకుండా కాపాడినందుకు సంతృప్తి పడాలన్నారు. ”బొగ్గుకు సమాధి తప్పదు. బొగ్గుకన్నా చౌకగా పునరుత్పాదక ఇంధన వనరులు అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి భారత్‌ సవరణ గురించి మరీ ఎక్కువగా ఆందోళన చెందనక్కర్లేదు” అని వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఉపాధ్యక్షురాలు హెలెన్‌ మమ్‌ ఫోర్డ్‌ అన్నారు. బొగ్గు వాడకంపై భారత్‌ ప్రతిపాదనను ఆమోదించకపోతే అసలు వాతావరణ ఒప్పందమే కుదిరేది కాదని అమెరికా వాతావరణ ప్రతినిధి జాన్‌ కెర్రీ వ్యాఖ్యానించారు. అయినా తాజా ఒప్పందం ప్రపంచానికి శుభవార్తేనన్నారు. చైనా కూడా శిలాజ ఇంధనాల విషయంలో భారత్‌ అనుసరించిన వైఖరికే మొగ్గుచూపింది. బొగ్గు వాడకాన్ని దశలవారీగా తగ్గిస్తూ, పేద దేశాలకు ఆర్థిక సాయం పెంచాలని సూచించింది. కాప్‌ 26 ఒప్పందం భూతాప కట్టడికి పెద్ద ముందంజ వేసిందనీ, బొగ్గు వాడకాన్ని దశలవారీగా తగ్గించడానికి మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ అంగీకారం కుదిర్చిందని బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఉద్ఘాటించారు. భూతాప కట్టడికి రాబోయే సంవత్సరాలలో చేయాల్సింది చాలా ఉన్నా, కాప్‌ 26 సదస్సు ఆ దిశగా నాంది పలుకుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

లక్ష్యాలు సాధించకున్నా.. పునాదులు వేశాం
గ్లాస్గో కాప్‌ 26 సదస్సు ప్రారంభం కావడానికి ముందు ఐరాస మూడు లక్ష్యాలను నిర్దేశించింది. అవి- 2030కల్లా కర్బన ఉద్గారాలను సగానికి సగం తగ్గించడం; పేద దేశాలకు సంపన్న దేశాలు ఏటా 10వేల కోట్ల డాలర్ల ఆర్థిక సాయం అందించడం; అందులో సగం నిధులను పేద దేశాలకు వాతావరణ మార్పులు కలిగించిన నష్టాన్ని తట్టుకోవడానికి వెచ్చించడం. ”కాప్‌ 26 సదస్సులో ఈ మూడు లక్ష్యాలను సాధించకపోయినా, మున్ముందు పురోగతి సాధించడానికి పునాది వేయగలిగాం” అని ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ చెప్పారు.