జిల్లాల పునర్విభజనలో అన్యాయం: వేగుళ్ళ లీలాకృష్ణ

*పవన్ కళ్యాణ్ దృష్టికి మండపేట సమస్య
*మండపేటను రాజమహేంద్రవరంలో ఉంచాలి
*అమలాపురంలో విలీనం చేయొద్దు
*జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ డిమాండ్

జిల్లాల పునర్విభజనలో మండపేటకు తీరని అన్యాయం జరగనుందని మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలోనే విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన ప్రక్రియలో మండపేట నియోజకవర్గంకు సంబంధించిన అంశాలను వివరించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకెళ్తానని స్పష్టం చేశారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరంలో విలీనం చేస్తే ఈ ప్రాంతంలోని ప్రజలకు అనుకూలంగా ఉంటుందని, నూతనంగా ఏర్పడే రాజమహేంద్రవరం జిల్లాలోనే మండపేట నియోజకవర్గాన్ని విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. అమలాపురం అయితే మండపేట దూరం అవుతుందన్నారు. భౌగోళికంగా, నైసర్గిక భిన్నంగా ఉండే ప్రాంతాలను కలపకుండా ఒకే సంస్కృతి ఉండే రాజమహేంద్రవరంలో విలీనం చేయాలని కోరారు. పవన్ తక్షణమే స్పందించి జిల్లాల పునర్విభజన ప్రక్రియలో అన్ని నియోజకవర్గాల ప్రాంత ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం లీలాకృష్ణ మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ మొదలైనప్పటి నుండి మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేయాలనేది నియోజకవర్గ ప్రజల ఆకాంక్షగా పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గాన్ని అమలాపురం జిల్లాలో విలీనం చేయడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీష్ పాలనలో ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా నేటి వరకూ ఎటువంటి మార్పులు లేకుండా ఉందన్నారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం జిల్లాలో విలీనం చేసి ఈ నియోజకవర్గ ప్రజల సెంటిమెంటును గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.