నేటికి వాయిదా పడిన ‘ధరణి’పై విచారణ

ధరణి వెబ్‌ పోర్టల్‌లో ఆస్తుల వివరాల నమోదుకు ఆధార్‌ సంఖ్య, సామాజిక వర్గం, కుటుంబ సభ్యుల వివరాలు కోరడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. న్యాయవాది కాశీభట్ల సాకేత్‌, గోపాల్‌శర్మ వేర్వురుగా ప్రజాహిత వాజ్యాలను దాఖలు చేయగా, కె.ఆనంద్‌కుమార్‌ వేసిన రిట్‌ పిటిషన్‌లను సోమవారం విచారించింది.

ఈ సందర్భంగా న్యాయవాది వివేక్‌రెడ్డి వాదిస్తూ.. చట్టబద్ధత లేకుండా ఆస్తుల నమోదుకు ఆధార్‌ సేకరిస్తున్నారని తెలిపారు. దీంతో సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆధార్‌ వివరాలు తీసుకోవచ్చని ఆధార్‌ చట్టంలోనే ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. వ్యవసాయ భూములకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న నేపథ్యంలో వివరాలు సేకరిస్తే తప్పేంటని ప్రశ్నించింది. సంక్షేమ పథకాలు తాత్కాలికంగా అమలు చేస్తున్నవేనని, చట్టబద్ధత లేదని.. ఎప్పుడైనా ఆపే అవకాశం ఉందని న్యాయవాది బదులిచ్చారు.

ఆధార్‌ వివరాలు ఇవ్వకుంటే భూములకు రిజిస్ర్టేషన్లు నిలిపివేస్తామని చెబుతున్నారన్నారు. ఆధార్‌ సంఖ్య, సామాజిక వర్గ వివరాలు సేకరించడానికి అనుమతించే చట్టాలు లేవని గోపాల్‌శర్మ తరఫు సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ వ్యాజ్యాల్లో ఇరుపక్షాల సైటేషన్స్‌ (సుప్రీంకోర్టు తీర్పులు)కు సంబంధించిన సంకలనాల (కూర్పు)ను ఇవ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులకు సూచించిన ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.