మరో అన్నమయ్య ప్రాజెక్టు కాకుండా, సోమశిల జలాశయాన్ని కాపాడుకుందాం

  • ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు, జనసేన నాయకులతో కలిసి ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ శనివారం సోమశిల జలాశయాన్ని సందర్శించడం జరిగింది. ప్రస్తుతం జలాశయం నుండి సుమారు 80 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా వచ్చిన వరదల కారణంగా జలాశయం ముందు భాగంలో సుమారు 30, 40 అడుగుల గోతులు పడ్డాయని తెలిపారు. డామ్ సేఫ్టీ రివ్యూ కమిటీ సోమశిల జలాశయ ముందు బాగాన వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించి, ఈ గోతులను వెంటనే పూడ్చాలని, లేనిపక్షంలో ప్రధాన జలాశయానికి ముప్పు పొంచి ఉందని నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఇచ్చి రెండు సంవత్సరాల కాలం గడిచినప్పటికీ, దెబ్బతిన్న భాగాలకి ఎటువంటి మరమ్మత్తులు చేపట్టకపోవడం జలాశయ భద్రత పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అద్దం పడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కొత్తగా ఎటువంటి జలాశయాలు నిర్మించకపోగా కొద్దిపాటి మరమ్మత్తులు చేయని కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకొని పోవడం మనకు అందరికీ తెలిసిందే. సోమశిల జలాశయం మరో అన్నమయ్య ప్రాజెక్టు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, వెంటనే జలాశయంలో దెబ్బతిన్న భాగాలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చేయాలని జనసేన పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుందని తెలిపారు. సోమశిల జలాశయం యొక్క వరద డిశ్చార్జి కెపాసిటీ 6 లక్షల 90 వేల క్యూసెక్కులు. గత రెండు సంవత్సరాల క్రితం దెబ్బతిన్న గాబియన్ రాక్ ఫిల్ కట్టను పునర్ నిర్మించని కారణంగా, లక్ష క్యూసెక్కుల వరద నీరు విడుదలకే సోమశిల గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జలాశయ భద్రతకు మరియు అదేవిధంగా సోమశిల గ్రామ ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికైనా సోమశిల జలాశయంలో వరదల కారణంగా దెబ్బతిన్న భాగాలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని జనసేన పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రవి, వేణు, తిరుపాలు, లక్ష్మీ కుమార్, నాగరాజా, అనిల్, వంశీ, చంద్ర, హజరత్ తదితరులు పాల్గొన్నారు.