అమరావతి మహిళలను అవమానించడం బాధాకరం: పవన్ కళ్యాణ్

అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేళ రాజధాని ప్రాంత మహిళలపట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా ఉంది.  రాజధాని అమరావతిలోనే ఉండాలని పోరాడుతున్న మహిళలు ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శనం చేసుకొనేందుకు వెళ్తున్న సందర్భంలో ప్రకాశం బ్యారేజీపై పోలీసులు అడ్డుకొని లాఠీలు ఝుళిపించి, అరెస్టులు చేసిన విధానం అవమానకర రీతిలో ఉన్నాయి.

తమపట్ల మగ పోలీసులు ఎంతఅవమానకరంగా ప్రవర్తించింది మహిళలు కన్నీళ్లతో చెబుతున్నారు. ఆ మాటలు చాలా బాధ కలిగించాయి. దైవ దర్శనం కోసం వెళ్తున్నవారిని అడ్డుకోవాలని ఏ నిబంధనలు చెబుతున్నాయి? అమరావతి మహిళలకు అమ్మవారిని దర్శించుకొనే హక్కు లేదా? రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, వారి కుటుంబాలు 15 నెలలుగా పోరాటం సాగిస్తున్నారు. రాజధాని విషయంలో స్త్రీలు అలుపెరుగకుండా ఉద్యమంలో కొనసాగుతున్నారు. వారిపట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన పాలకులు ప్రతి సందర్భంలోను అవమానపరుస్తున్నారు.

శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలియచేస్తున్నవారిని అరెస్టులు చేశారు. వారిని తక్షణమే విడుదల చేయాలి. మహిళలపై గౌరవంగా మెలగాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రకాశం బ్యారేజీపై మహిళలను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.