తిరుమల డిక్లరేషన్ పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు కారణమైన అంశంపై ఏపీ హైకోర్టులో దాఖలైన ఒక పిటిషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు వాదనలు.. వ్యాఖ్యలు జరిగాయి. ఇంతకూ.. ఆ పిటిషన్ దేనికి సంబంధించింది? దానికి ఏపీ హైకోర్టు ఏం చెప్పిందన్న వివరాల్లోకి వెళితే..ఆ మధ్యన తిరుమల బ్రహ్మెత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల్ని సమర్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావటం.. క్రైస్తవుడైన ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామివారి దర్శనం ఎలా చేసుకుంటారని ప్రశ్నించటమే కాదు.. నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వనందున ఆయన్నుఆ పదవిలో కొనసాగకుండా నియంత్రించాలని కోరుతూ కోవారెంటో రిట్ పిటిషన్ ను వేశారు. దీన్ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తాజాగా తీర్పును వెల్లడిస్తూ ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. క్రైస్తవ మతాన్ని ఆచరించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాల్ని సమర్పించేందుకు తిరుమలకు వెళ్లినట్లుగా పేర్కొన్న పిటిషన్ లో.. జగన్ క్త్రైస్తవుడని నిరూపించేందుకు తగిన ఆధారాల్నిసమర్పించలేదని.. ఈ కారణంగానే కేసును కొట్టేస్తున్నట్లుగా హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

పిటిషన్ లో పేర్కొన్న అంశాలపై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు స్పందిస్తూ.. ”క్త్రైస్తవ సువార్త సమావేశాలకు.. చర్చిలో ప్రార్థనలకు హాజరైనంత మాత్రాన ఒక వ్యక్తిని క్రైస్తవుడిగా పరిగణించలేం. జగన్మోహన్ రెడ్డి ఇటీవల విజయవాడలోని గురుద్వారాలో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. అంతమాత్రాన ఆయన సిక్కు మతాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలా? చర్చి ప్రార్థనల్లో పాల్గొనటం.. బైబిల్ కు సంబంధించినపేరు కలిగి ఉండటం.. ఇంట్లో శిలువ ఉన్నంత మాత్రాన వారిని క్త్రైస్తవులుగా పరిగణించాలా? అంటే లేదనే చెప్పాలి. టీటీడీ ఆహ్వానం మేరకు రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా సీఎం హోదాలో పట్టువస్త్రాలు సమర్పించేందుకు జగన్ తిరుమలకు వెళ్లినందున డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు” అని పేర్కొన్నారు. అదే సమయంలో.. హైందవేతరులు వ్యక్తిగత హోదాలో శ్రీవారి ఆలయానికి వెళ్లినప్పుడు మాత్రం 136వ నిబంధన కింద డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *