ఉప్పలగుప్తం: వైస్సార్సీపీ నాయకుడు, చల్లపల్లి ఎంపీపీ భర్త దంగేటి రాంబాబు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవాని కేసును జాతీయ ఎస్టీ కమిషన్ విచారణకు తీసుకుంది. 2022 జూలై 7న జరిగిన ఈ ఘటనకు సంబంధించి, విచారణ నిమిత్తం ఈ నెల 17వ తేదీన (17-6-2025) ఢిల్లీలో సాక్షులను హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది. రొడ్డా భవాని (ఎం.ఎస్.సి గోల్డ్ మెడలిస్ట్) అప్పట్లో చల్లపల్లి పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తుండగా, ఎంపీపీగా ఎన్నికైన అచ్యుతా జానకిరామ్ భర్త దంగేటి రాంబాబు ఆధిపత్య ధోరణితో కార్యదర్శిని వేధించడం ప్రారంభించాడు. తన ఆదేశాలు పాటించాలంటూ బలవంతంగా ఒత్తిడి తెచ్చి, కుల ప్రాతిపదికన విమర్శలు చేస్తూ ఉద్యోగానికి ఆటంకం కలిగించేవాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల వల్ల తీవ్ర మనోవేదనకు లోనైన రొడ్డా భవాని 2022 జూలై 7న ఆత్మహత్య చేసుకున్నది. అయితే అప్పటి ప్రభుత్వ అండతో దంగేటి రాంబాబును కేసు విచారణ నుండి తప్పించడంతో, బాధిత కుటుంబం 21-7-2022న జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించింది. దీంతో కమిషన్ ఈ విషయాన్ని విచారణకు తీసుకుని, తాజాగా విచారణను 17-6-2025న ఢిల్లీలో నిర్వహించనుంది. ఈ సందర్భంగా రొడ్డా భవాని న్యాయ పోరాట సమితి కన్వీనర్ బొంతు రమణ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, దంగేటి రాంబాబు వంటి బాధ్యతలేని నాయకులపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇటువంటి దుస్థితి మరెవరికీ ఎదురుకాకుండా చూడాలని కోరారు.
Share this content:
Post Comment