IPL 2021: ఉత్కంఠపోరులో పంజాబ్‌ గెలుపు

ముంబై: ఐపీఎల్‌ 14లో పంజాబ్‌ కింగ్స్‌ బోణీ కొట్టింది. సోమవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షో కనబర్చిన పంజాబ్‌ 4 పరుగుల తేడాతో గెలిచింది. 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ 7 వికెట్లకు 217 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌(119: 63 బంతుల్లో 12 ఫోర్లు, 7సిక్సర్లు) భారీ శతకం వృథా అయింది. జట్టును గెలిపించేందుకు ఆఖరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు.

లక్ష్య ఛేదనలో రాయల్స్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. బెన్‌స్టోక్స్‌, మనన్‌ వోహ్రా విఫలమయ్యారు. జట్టు స్కోరు 0/1తో ఉండగా వన్‌డౌన్‌లో వచ్చిన శాంసన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆరంభం నుంచి ఆఖరి వరకు ఏ దశలోనూ వెనకడుగు వేయకుండా జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. జోస్‌ బట్లర్‌(25), శివమ్‌ దూబే(23), రియాన్‌ పరాగ్‌(25) ఫర్వాలేదనిపించారు. పంజాబ్‌ బౌలర్లు కళ్లుచెదిరే బంతులతో ఇబ్బందిపెడుతుండగా, టాప్‌ -3 బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరడంతో రాజస్థాన్‌ కనీసం 180 స్కోరైనా చేస్తుందా అనిపించింది. కానీ, అలాంటి స్థితిలో శాంసన్‌ అంచనాలను తలకిందులు చేస్తూ జట్టును లక్ష్యానికి చేరువగా తీసుకొచ్చి శభాష్ అనిపించుకున్నాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్షదీప్‌ సింగ్‌ మూడు వికెట్లు తీయగా మహ్మద్‌ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు కేఎల్‌ రాహుల్‌(91: 50 బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు), దీపక్‌ హుడా(64: 28 బంతుల్లో 4ఫోర్లు, 6 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 పరుగులు చేసింది. ఆరంభంలో స్టార్‌ బ్యాట్స్‌మన్ క్రిస్‌ గేల్‌(40: 28 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. చేతన్‌ సకారియా ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్‌ మోరీస్‌ 2 వికెట్లు తీసినా ధారళంగా పరుగులు ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *