ధాన్యం కొనుగోలులో అక్రమాలను అరికట్టాలి: గురాన అయ్యలు

విజయనగరం, ధాన్యం కొనుగోలులో అక్రమాలను అరికట్టాలని జనసేన నేత గురాన అయ్యలు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యాన్ని ఏవేవో సాకులు చెబుతూ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల వద్ద నుండి క్వింటాకు అదనంగా 5 కిలోల ధాన్యం తూకం వేస్తున్నారన్నారు. అలాగే ఖర్చుల పేరుతో రైతుల వద్ద నుండి క్వింటాకు 12 నుండి 15 రూపాయిలు వసూల్ చేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం తూకంలో కూడా మోసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లన రైతులు కన్నీరు కారుస్తున్నారన్నారు. రైతులను కన్నీరు పెట్టించటం మంచిది కాదన్నారు. బరితెగిస్తున్న అక్రమార్కుల వైపు అధికార యంత్రాంగం కన్నెత్తి కూడా చూడటం లేదన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ దారుణంగా ఉందని ఆరోపించారు. చేతికొచ్చిన సమయంలో తుఫాన్ వల్ల పంటలు పాడయ్యాయని, మిగిలిన పంటలను రైతులు నూర్పులు వేసి కళ్ళాల్లో నిల్వచేశారన్నారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్మకాలు చేసుందుకు ఆర్బికెల చుట్టూ, మిల్లుల చుట్టూ తిరుగుతూ, పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళారులబారీన పడి రైతులు దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు. నేరుగా రైతుల కల్లాలకు వెళ్లి కొనుగోలు చేసే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మన్యం జిల్లాలో ఇచ్చినట్టు విజయనగరం జిల్లాలో కూడా తూర్పుగోదావరి జిల్లా మిల్లులకు ధాన్యం కొనుగోలు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న సంక్రాంతి పండగని దృష్టిలో పెట్టుకుని అధికారులు తక్షణమే స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాలో వరి ధాన్యం సేకరణ, రవాణా చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన పార్టీ తరుపున రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు.