మంత్రి జోగి రమేష్ కి జనసేన బ్యానర్లు అంటేనే భయమా?

  • పెడన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు

పెడన నియోజకవర్గం: మంత్రి జోగి రమేష్ కి జనసేన బ్యానర్లు అంటేనే భయమా? అని పెడన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్ తాను మీటింగు జరుగుతున్న గ్రామంలో ఏదైనా జనసేన బ్యానర్ ఉంటే ముందే తీసివేయాలని స్థానిక కార్యకర్తలను అధికారులను ఒత్తిడి చేయటం పరిపాటి. గతంలో బల్లిపర్రు గ్రామానికి మంత్రి జోగి రమేష్ వచ్చినప్పుడు జనసేన బ్యానర్లను సచివాలయం సిబ్బంది తొలగించడం జరిగింది. అధికార మదంతో చేస్తున్నారు లే అని సరిపెట్టుకున్నాం. మంగళవారం బల్లిపర్రు గ్రామానికి మంత్రి జోగి రమేష్ రావడం జరిగింది. విచిత్ర ఏమిటంటే బల్లిపర్రు సెంటర్లో ఉన్న టిడిపి బ్యానర్ ని తీయమని మంత్రి ఆదేశించలేదు. నిత్యము చంద్రబాబునాయుడు గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ తన అక్కస్సును వెళ్లగక్కే మంత్రి జోగి రమేష్ నిజస్వరూపాన్ని నియోజకవర్గ ప్రజలు గమనించాలి. బహిరంగంగా విమర్శలు చేస్తూ చీకటిలో తెలుగుదేశం నాయకులను కౌగిలించుకునే నీచ రాజకీయాలను మంత్రి చేస్తున్నాడు. బందర్లో బాబాయ్ అబ్బాయి రాజకీయం పెడన నియోజకవర్గంలో భాయి భాయి రాజకీయం. కుమ్మక్కు రాజకీయాలు, కుల రాజకీయాల వల్లే పెడన మున్సిపాలిటీ ఎన్నికల్లో టిడిపి కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయిందనేది ఆ పార్టీ నాయకులే అనుకుంటున్నారు. నిత్యం పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ తీసుకున్నాడు అని మొరిగే జోగి రమేష్ చేస్తున్న నీచ రాజకీయాలను నియోజవర్గ ప్రజలు గమనించాలని ఎస్ వి బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలచుకున్నాను అని తెలుపుతూ.. ముఖ్యంగా అమాయకులైన వైసిపి కాపు నాయకులు గమనించాలని, టిడిపి బ్యానర్ తొలగించాలనేది నా ఉద్దేశం కాదు. దయచేసి టిడిపి నాయకులు కార్యకర్తలు గమనించగలరని ముఖ్య గమనిక చేసారు.