దసరా నాటికి ఐటీ హబ్ ప్రారంభo.. హబ్‌లో స్థానిక యువతకు ఉద్యోగాలు : పువ్వాడ అజయ్

ఖమ్మంలో ఐటీ హబ్ నిర్మాణం పూర్తయింది. దసరా నాటికి ఐటీ హబ్ ప్రారంభిస్తామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఐటీ హబ్‌లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐటీ హబ్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్ 30 నాటికి అన్ని పూర్తి చేసి ఎంఓయూ చేసుకున్న కంపెనీలకు అప్పగిస్తామన్నారు. ఆయా కంపెనీలతో ఆన్ లైన్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించామని, వాళ్లు కూడా సిద్దంగా ఉన్నారని మంత్రి చెప్పారు. అక్టోబర్‌లో కార్యకలాపాలు మొదలుపెడతామన్నారు. ఇప్పటి వరకు 8 కంపెనీలు ఎంఓయూ చేసుకున్నాయని, సుమారు 300 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అజయ్ కుమార్ తెలిపారు.