జనసేనకు ఇది ఒక బాధ్యత

 గంజాయి, డ్రగ్స్ అరికడతాం
• మహిళా రక్షణ, యువతకు ఉపాధి ప్రధాన లక్ష్యం
• జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జనసేన పార్టీకి 100 శాతం స్ట్రైక్ రేట్ తో 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలను ఒక బాధ్యతతో అప్పజెప్పారని, అదేవిధంగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమిని అత్యధిక స్థానాల్లో గెలిపించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేశారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. చేబ్రోలులోని జనసేన పార్టీ కార్యాలయంనకు తరలివచ్చిన కార్యకర్తలతో శ్రీ నాగబాబు గారు మాట్లాడారు. కూటమి గెలుపు కోసం శ్రమించిన ప్రతీ ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి 15 ఏళ్ల శ్రమ ఈ రోజు ఫలించిందని అన్నారు. 2019లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ బలమైన పునాదులు వేశామని, శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరంలో ఓడినప్పటికీ బలంగా నిలబడ్డారని అన్నారు. పిఠాపురం నియోజక వర్గంలో ప్రేమతో గెలిపించుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికడతామని చెప్పారు. మహిళా రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తు కల్పిస్తామని చెప్పారు. ముఖ్యంగా యువత భవిష్యత్తు గురించి, అందరికంటే ఎక్కువ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారని అన్నారు. సొంత డబ్బుతో యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం శాసన సభ్యులుగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు అందించిన దృవీకరణ పత్రం అందరికీ చూపిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కష్టపడి గెలిపించుకున్న జన సైనికులకు, వీర మహిళలకు అభినందనలు తెలిపారు. గెలుపు ఉత్సాహంతో ఆవేశాలకు గురి కాకుండా సంయమనం పాటించాలని సూచించారు.
• పిఠాపురంలో శ్రీ పవన్ కళ్యాణ్ ని ప్రేమతో గెలిపించుకున్న ప్రజలకు కృతజ్ఞతలు
పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకున్న ప్రజలకు శ్రీ నాగబాబు గారు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం బాధ్యతతో కృషి చేసిన తెలుగుదేశం నాయకులు శ్రీ వర్మ, బీజేపీ నాయకులు డాక్టర్ బుర్రా వరుణ్ కృష్ణంరాజ్ , జనసేన నేతలు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్, శ్రీ వేములపాటి అజయ్ కుమార్, శ్రీ మహేందర్ రెడ్డి, శ్రీ శంకర్ గౌడ్, శ్రీ రత్నం, శ్రీ యాతం నగేష్, డాక్టర్ పంచకర్ల సందీప్, శ్రీ శశి యాదవ్, శ్రీమతి గంటా స్వరూపా, శ్రీమతి కడలి ఈశ్వరి, శ్రీమతి కాట్నం విశాలి, పిఠాపురం నియోజక వర్గం నేతలు నాయకులు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, డాక్టర్ పిల్లా శ్రీధర్, శ్రీ తెలగంశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీ జ్యోతుల శ్రీనివాస్, శ్రీ నాయుడు, శ్రీమతి చల్లా లక్ష్మీ, కుమారి జ్యోతి, తదితరులకు అభినందనలు తెలిపారు.