షర్మిలకు తెలంగాణలో ఓట్లు రావడం కష్టం

తెలంగాణలో షర్మిల పార్టీకి ఓట్లు రావడం కష్టమని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్నట్లు వైఎస్‌ షర్మిల ప్రకటించడం పట్ల ఆయన స్పందించారు. షర్మిల పార్టీ పెట్టడానికి కారణం సీఎం జగనా లేక ఎవరనేది త్వరలో తెలుస్తుందని అన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తాను తెలంగాణకు వ్యతిరేకమని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

వైఎస్‌ సమైక్యవాది అన్న విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. షర్మిల తెలంగాణలో కాకుండా తమిళనాడు లేదా కర్నాటకలో పార్టీ పెడితే మంచి ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ జైళ్లో ఉన్నప్పుడు పార్టీ కోసం షర్మిల చాలా కష్టపడిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య అద్భుతమైన అనుబంధం ఉందని, ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలుంటే షర్మిల ఏపీలో పార్టీ పెట్టకుండా తెలంగాణలో ఎందుకు పెడుతుందని ఆయన ప్రశ్నించారు.