భవనం కూలి నలుగురి మృతి బాధాకరం

విశాఖపట్నం 29వ వార్డులోని రామజోగిపేటలో మూడు అంతస్తుల కాలం తీరిన ఇల్లు కూలి నలుగురు ప్రాణాలు కోల్పోవడం, మరో నలుగురు గాయపడడం చాలాబాధాకరం. మృతుల్లో తల్లి, ఇద్దరు బిడ్డలు, ఉపాధి కోసం ఒరిస్సా నుంచి వచ్చిన యువకుడు ఉన్నారని తెలిసి కలత చెందాను. ప్రాణాలు చాలా విలువైనవి. ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మనకు అవగతమే. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల పరిస్థితి తలచుకుంటే తీరని ఆవేదన కలుగుతుంది. పాత భవనాలతో ప్రమాదం అనునిత్యం వెంటాడుతూనే ఉంటుంది.ఇటువంటి భవనాల తొలగింపు అధికారులకు ఎంతటి కష్ట సాధ్యమో నేను అర్ధం చేసుకోగలను. అయితే కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకోకుండా పాత భవనాల విషయంలో అధికారులు సదా అప్రమత్తతతో ఉండాలి. కొత్త ఇళ్ళు నిర్మించుకోడానికి యజమానులకు ఉదారంగా సాయపడాలి. అనుమతులు శీఘ్రగతిన జారీ చేయాలి. అలా చేస్తేనే ఇటువంటి ప్రమాదాలను, దుర్మరణాలను నివారించే అవకాశం ఉంటుంది. విశాఖ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరితగతిన కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. వారి కుటుంబాలకు తగిన ఆర్థిక సాయం అందించాలి.