పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటడం మన అందరి బాధ్యత : నాగార్జున

నిన్నమొన్నటి వరకు బిగ్‎బాస్ సీజన్ ఫోర్‎తో బిజీబిజీగా గడిపిన అక్కనేని నాగార్జున ప్రస్తుతం సామాజిక కార్యమాలో పాల్గొంటున్నారు. తాజాగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 49లో ప్రత్యేకమైన మొక్కలు నాటారు. తమ కాలనీ పచ్చదనంతో ఉండాలనే సదుద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమంలో వాల్గో ఇన్‌ ఫ్రా ఎండి., సిఇఓ శ్రీధర్‌ రావుతో కలిసి నాగార్జున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు. జూబ్లీహిల్స్‌ సొసైటీ పార్క్‌ కోసం శంకుస్థాపన కూడా చేశారు. అక్కడ ఇంకా ఎన్నో ప్రత్యేకమైన చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడే ఒక చెట్టు కింద కూర్చొని కాసేపు సమయం గడిపారు. మాస్టర్‌ అబూ శ్రీని తన ఒడిలో కూర్చోబెట్టుకొని కాసేపు చిన్నారితో ఆడుకున్నారు. ఆ తర్వాత కాలనీ వాసులతో మాట్లాడి, చెట్లు పెంచుతున్న వాళ్ల నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. పచ్చదనం కోసం మరిన్ని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మన పరిసరాలను పచ్చదనంతో నింపుకోవడం మన బాధ్యత అంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగార్జున స్నేహితుడు సతీష్‌ రెడ్డి, అశోక్‌ బాబుతోపాటు పలువురు కాలనీవాసులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.