ఎన్నికల సమరానికి సిద్ధం కావాలి: రెడ్డి అప్పలనాయుడు

  • జనసైనికులు, వీరమహిళలకు పిలుపునిచ్చిన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నియోజకవర్గం: రాష్ట్రంలోని జగన్ రెడ్డి అసమర్థత, అరాచక పాలన తరిమి కొట్టేందుకు జనసైనికులు, వీరమహిళలందరూ సమరానికి సిద్ధం కావాలని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో అత్యవసర సమావేశాన్ని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రజలను వంచించి ఇబ్బందులకు గురి కురిచేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. చట్టానికి, రాజ్యానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జగన్ రెడ్డి పాలన చేస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నాడని రెడ్డి అప్పలనాయుడు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య వాదులను, రాజకీయ నాయకులను, ప్రతిపక్ష పార్టీల వారిని జైల్లో పెడుతూ జగన్ రెడ్డి అరాచక పాలన కొనసాగిస్తున్నారన్నారు. జగన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాలనలో ఉపాధి కరవైందని, వ్యాపారాలు లేవని, పారిశ్రామికవేత్తలను బెదిరించడంతో ఇతర రాష్ట్రాలకు వలసలు పోయారని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారయిందన్నారు. ప్రజలపై చెత్త పన్ను వేసి, ఇంటి పన్నులు పెంచివేయడమే కాకుండా కరెంట్ చార్జీల భారాలను ఎప్పటికప్పుడు వేస్తూ ప్రజలను ఆర్థికంగా ఈ ప్రభుత్వం కృంగదీసిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ ఒరిజినల్స్ ప్రభుత్వం వద్ద ఉంచుకొని జిరాక్స్ కాపీలను ప్రజలకు ఇస్తుందన్నారు. జగన్ కు మానసిక స్థితి దెబ్బతిందన్నారు. మానసిక స్థితి లేని జగన్ రెడ్డిని పిచ్చాసుపత్రిలో చేర్చాలని వైసీపీ నాయకులకు రెడ్డి అప్పలనాయుడు సూచించారు. అరాచక, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తున్న జగన్ రెడ్డి పాలనను రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు, యువతీ యువకులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు సిద్ధమయ్యారని రెడ్డి అప్పలనాయుడు చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో అరాచకాలకు పాల్పడిన క్రిమినల్స్ అందరిని జైలుకు పంపే సమయం ఆసన్నం అయిందన్నారు. రాష్ట్రంలో ఐదున్నర కోట్ల మంది ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీతో కలిసి పయనిద్దామని చెప్పారు. కలిసివచ్చే బీజేపీతో కలిసి జనసేన, టిడిపి కూటమి రాష్ట్రంలోని 175 స్థానాలన్నింటినీ కైవసం చేసుకుంటుందని రెడ్డి అప్పలనాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ 151 సీట్లు సాధించిన జగన్ రెడ్డి పాలనపై సంవత్సర కాలం పాటు వేచి చూసి స్పందిద్దామని, మంచి పాలన చేస్తే సమర్థిద్దామని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. అయితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూల్చడంతో అరాచక పాలన ప్రారంభించారని, ఇసుక పాలసీ మార్చి, రేటు పెంచి వేసి లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేసి ఉపాధిని దెబ్బతీశారన్నారు. ఇటువంటి రాక్షసుల పాలనను తరిమికొట్టేందుకు రాష్ట్రంలోని ప్రజలందరూ సిద్ధమయ్యారని చెప్పారు. మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బీవీ రాఘవయ్య చౌదరిలు మాట్లాడుతూ వివిధ పన్నుల రూపంలో ప్రజలను దోచుకుంటూ ప్రజా జీవితాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయాత్ర, జనవాని కార్యక్రమాలను జగన్ రెడ్డి ప్రభుత్వం అడ్డుకుని ఇబ్బందులకు గురి చేసిందన్నారు. మన పార్టీ నాయకులను బయటకు రాకుండా అడ్డుకుందన్నారు. అయినా మన సంకల్పం ముందు ప్రభుత్వం ఓడిపోయిందని చెప్పారు. టిడిపితో జనసేన పార్టీ పొత్తు ఉంటుందని సంవత్సరం క్రితమే పవన్ కళ్యాణ్ ప్రకటించారని గుర్తు చేశారు. సింహాలైన, మరే జంతువులైన జనసేన పార్టీ సిద్ధాంతాల ముందు నిలబడలేవని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వం మారబోతుందని, జగన్ పోతున్నాడని, జగన్ పోవాలి… పవన్ రావాలనే ప్రజల ఆకాంక్ష నిజం అవుతుందని చెప్పారు. జగన్ మైండ్ సరిగ్గా ఉందా? లేదా? అనే అనుమానం కలుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని జగన్ రెడ్డి నిలిపివేసి రాష్ట్రాన్ని తిరోగమనంలో పయనింప చేశాడని ఆరోపించారు. సీఎం జగన్ తో కలిపి వైసిపి నాయకులందరినీ మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలని హితవుపలికారు. రాష్ట్రానికి పట్టిన జగన్ పీడ త్వరలోనే వదిలిపోతుందన్నారు.