మత్స్యకారుల ఉపాధికి విఘాతం కలిగిస్తున్న జగన్ రెడ్డి

*అందుకే జీవో 217 తెచ్చారు
*మత్స్యకారుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది?
*వాకలపూడిలో మీడియాతో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం. 217తో సుమారు 4.5 లక్షల మంది మత్స్యకారుల ఉనికి, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని మత్స్యకార సొసైటీలు ఆందోళన చెందుతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. చెరువులు ఆన్ లైన్ ద్వారా వేలం నిర్వహిస్తే దాదాపు 2500 మత్స్యకార సంఘాలు నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తీర ప్రాంతాల్లో ఉన్న 555 మత్స్యకార గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తుందని, రోడ్లు, రేషన్, పెన్షన్ సమస్యలతో మత్స్యకారులు అల్లాడిపోతున్నారని అన్నారు. మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా సూర్యారావుపేట, వలసపాకల, వాకలపూడి, గంగరాజు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి మత్స్యకారులు, మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాకలపూడిలో మీడియాతో శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “మత్స్యకార అభ్యున్నతి యాత్ర ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతుంది. యాత్రలో భాగంగా మత్స్యకారుల స్థితిగతులపై అధ్యయనం చేసి, వారు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై నివేదిక తయారు చేసి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందిస్తాం. 20వ తేదీన నరసాపురంలో జరిగే బహిరంగ సభలో ఈ సమస్యలను ప్రస్తవించి వాటిపై పార్టీ విధానాలు వెల్లడిస్తారు. అలాగే మత్స్యకారుల అభ్యున్నతికి పార్టీ తరపున భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నామన్న విషయాలు వివరిస్తారు.

*3 వేల లీటర్లు అవసరమైతే 300 లీటర్లు ఇస్తున్నారు

ఒక వైపు డీజిల్ ధరలు పెరుగుతుంటే… మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మాత్రం పెరడగం లేదు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు డీజిల్ పై రూ. 9 సబ్సిడి ఇస్తున్నారు. అది కూడా అందరికీ దక్కడం లేదు. వేటకు వెళ్లినప్పుడు 3వేల లీటర్ల డీజిల్ అవసరమైతే కేవలం 300 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అది కూడా ఇవ్వడం లేదు. దీంతో ఖర్చులు భరించలేని స్థితిలో చాలామంది మత్స్యకారులు వేట మానేస్తున్నారు. మత్స్యకారులకు భరోసా కల్పించే విధంగా వ్యవస్థ పని చేయడం లేదు. వారికి ఉపాధి కల్పించడం లేదు. అవసరమైన లోన్లు ఇవ్వడం లేదు.

*మంత్రి గారూ.. వాళ్ల పరిస్థితి ఏంటి ?

కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రి అయిన నాయకుడు 200 మంది పోలీసుల సహాయంతో వందల మత్స్యకార కుటుంబాలను ఇక్కడ నుంచి తరిమేశారు. వారికి తగిన నష్టపరిహారం ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు కనీసం వారికి గూడు లేకుండా చేశారు. దాని గురించి ఇప్పటి వరకు ఆయన స్పందించింది లేదు. ఇలాంటి సంఘటనలు జరగకుండా మత్స్యకారుల్లో చైతన్యం నింపడానికే ఈ యాత్ర చేపట్టాం” అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ నేతలు పంతం నానాజీ, కందుల దుర్గేశ్, ముత్తా శశిధర్, బొమ్మిడి నాయకర్, సంగిశెట్టి అశోక్, శ్రీమతి సుంకర కృష్ణవేణి, కరెడ్ల గోవింద్ పాల్గొన్నారు.